
సాక్షి, పశ్చిమగోదావరి : దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఇప్పటివరకూ పోలీసులు కేసు నమోదు చేయకపోవడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్నప్పటకి పోలీసులు మాత్రం స్పందించడం లేదు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వదిలేసి.. వీడియోను షేర్ చేసిన వైఎస్సార్ సీపీ కార్యకర్త కత్తుల రవికుమార్‌ని అరెస్ట్ చేయడం పట్ల దళిత సంఘాలు మండిపడుతున్నాయి. చింతమనేని విషయంలో చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తూ.. ఈ వ్యవహారాన్ని పక్క దారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ దళిత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసుల వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్నారని దళిత నేతలు మండిపడుతున్నారు.
అంతేకాక ప్రభుత్వం పెద్దల ఆదేశాల మేరకే పశ్చిమ పోలీసులు నడుచుకుంటున్నారని.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున అధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి.. వినతి పత్రం సమర్పించాలని దళిత సంఘాల నేతలు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment