సాక్షి, గుంటూరు : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిన నేపథ్యంలో ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మౌనం వీడారు. గుంటూరు జిల్లాలోని కాకానిలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 17 రోజులకు ఆయన మాట్లాడటం గమనార్హం.
విభజనతో ఏపీ నష్టపోయిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాలనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని చెప్పుకొచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సరైన కేటాయింపులు లేవని పేర్కొన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు.
ప్రత్యేక హోదా మాట ఏది చంద్రబాబు..!
దాదాపు 17 రోజుల తర్వాత ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఎట్టకేలకు కేంద్రం తీరుపై స్పందించారు. అయితే, ఆయన స్పందన ముక్తసరిగా ఉండటం గమనార్హం. ఏపీకి నిధులు కావాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నానని చెప్తూనే.. రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు కేంద్రంపై ఏవిధంగా ఒత్తిడి తెస్తారో ఆయన ప్రకటించలేదు. సీఎం చంద్రబాబు నోట ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా మాట రాకపోవడం ప్రజలను విస్మయపరుస్తోంది. కేంద్రం ప్రజాకాంక్షలను నెరవేర్చకపోతే.. ప్రత్యేక హోదాపై ప్రకటన చేయకపోతే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంపీల రాజీనామాపై చంద్రబాబు దాటవేత ధోరణిని ప్రదర్శించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment