
సాక్షి, అమరావతి: తనపైనా, తన కుమారుడిపైనా అవినీతి ఆరోపణలు చేసే ముందు అమిత్‌షా కుమారుడి అవినీతిపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆదివారం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అమిత్‌షా కుమారుడి అవినీతి వ్యవహారాలను చంద్రబాబు ప్రస్తావించినట్లు తెలిసింది. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తనపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేసిన విషయాన్ని చంద్రబాబు ఉటంకిస్తూ.. అమిత్‌షా, ఆయన కుమారుడు జైషా అవినీతిని ప్రశ్నించి బీజేపీపై ఎదురుదాడి చేయాలని టీడీపీ నేతలకు సూచించారు.
బీజేపీ నేతలు తమ అవినీతి చరిత్రను చదువుకోవాలని, నీతులు వల్లిస్తున్న బీజేపీ నేతలు రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు కుయుక్తులు పన్నారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో బలం లేకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టడం దేశమంతా చూసిందన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిందని ఆరోపించారు. అమిత్‌షా లేఖకు అసెంబ్లీలోనే సమాధానం ఇచ్చానని, నాలుగేళ్లయ్యాక ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ అంటున్నారని విమర్శించారు. యూసీలు ఇవ్వలేదు కాబట్టే నిధులు ఆపామని చెప్పడం సరికాదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులన్నింటికీ యూసీలు ఇచ్చామన్నారు. ఆర్థిక లోటు విషయంలో యూసీలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. యూసీలు ఇవ్వడంలో దేశంలోనే ఏపీ 3వ స్థానంలో ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తే రాష్ట్రానికి మద్దతునివ్వడమేనని, టీడీపీని బలహీనపరిస్తే రాష్ట్రాన్ని బలహీనపరచడమేననే విషయం ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ఆంధ్రపక్షమా? కేంద్రపక్షమా? ఆయా పార్టీల నేతలు తేల్చుకోవాలన్నారు. ప్రజల కోసం పోరాడే ముఖ్యమంత్రి పక్షాన ఉంటారా..? రాష్ట్రానికి అన్యాయం చేసే కేంద్రం పక్షాన ఉంటారా..? అని వివిధ పార్టీల నేతలను ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment