గాజులపేటలో 33 ఎకరాల లేఅవుట్‌లో 1,600 మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇస్తున్నాం. ఇక్కడ ఎకరా కనీసం రూ.3 కోట్లు ఉంటుంది. చదరపు గజం విలువ రూ.5 వేలు. ఇంత మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనుండటం.. ఆ స్థలాల పక్కనే వారు చక్కగా మొక్కలు నాటడం చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది.
సీఎం చేతుల మీదుగా వన మహోత్సవం
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని గాజులపేట ‘వనం మనం’ ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ పేదల కోసం ఏర్పాటు చేసిన లే అవుట్‌లో మొక్కలు నాటి ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వేప, రావి మొక్కలు నాటి, నీరు పోశారు. వన మహోత్సవంలో భాగంగా 20 కోట్ల మొక్కల్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. హంగూ ఆర్భాటాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదన్న సీఎం సూచనల మేరకు నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సాక్షి, అమరావతి/ అమరావతి బ్యూరో: రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాలను సైతం అడ్డుకునే దౌర్భాగ్యపు రాజకీయం సాగుతోందని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ప్రతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కోర్టుల ద్వారా అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. పేదలకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారని, దీంతో చివరకు పేదల పక్షాన ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. బుధవారం ఉదయం ఆయన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గాజుల పేట వైఎస్సార్ జగనన్న కాలనీలో మొక్కలు నాటి.. 71వ వన మహోత్సవం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఆలోగా దేవుని దయవల్ల కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం వస్తుందనే విశ్వాసం ఉందన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల స్థల పట్టాలు ఇస్తామని తెలిపారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..
టీడీపీ వేస్తున్న కేసుల తీరు అందరికీ తెలుసు
► ఏ రకంగా టీడీపీ వాళ్లు కేసులు వేస్తున్నారో మీ అందరికీ తెలుసు. చివరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని కూడా అడ్డుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాలు దౌర్భాగ్యంగా ఉన్నాయనడానికి ఇంతకంటే వేరే నిదర్శనం అవసరం లేదు.
► రాష్ట్రంలో 1.48 కోట్ల ఇళ్లు ఉంటే, ఇప్పుడు ఒకేసారి 30 లక్షల కుటుంబాలకు అనగా 20 శాతం మందికి ఇంటి స్థలం ఇస్తున్నాం. అర్హుల్లో ఎవరికైనా ఇంటి స్థలం రానిపక్షంలో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇస్తాం. రాష్ట్రమంతా దాదాపు 13 వేల గ్రామ పంచాయితీలుంటే 17 వేల లేఅవుట్లు వేసి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం.
ప్రజలతో ప్రతిజ్ఞ..
– మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా పచ్చదనం పెంపుదలకు పాటు పడతామంటూ సీఎం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ‘ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరుగుతాను. ప్రకృతిలోని సమతుల పరిస్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగ పరుస్తాను. చెట్ల అవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ, వనాలను నరకను.. నరకనివ్వను. విరివిగా మొక్కలు నాటుతాను. మన ఊరూరా వాడ వాడలా ఇంటా బయటా, అన్ని చోట్లా మొక్కలు నాటడంతో పాటు, వాటి సంరక్షణ బాధ్యత కూడా స్వీకరిస్తాను. ఆంధ్రప్రదేశ్‌ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అని సీఎం ప్రమాణం చేశారు. కార్యక్రమానికి హాజరైన వారు కూడా ఇలాగే ప్రమాణం చేశారు.
– ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ వీరందరూ నవరత్నాల తరహాలో తొమ్మిది రకాల మొక్కలు నాటారు.
విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్న ఇళ్ల పట్టాల లబ్ధిదారులు
ఉద్యమంలా జగనన్న పచ్చతోరణం
జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంలో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల లే ఔట్ల వద్ద, రోడ్ల వెంబడి, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున సాగింది. ఒక్క రోజునే.. ఒక్క గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోనే 40 లక్షల మొక్కలు నాటారు. కృష్ణా జిల్లాలో సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, జిల్లా వ్యాప్తంగా 1.30 లక్షల మొక్కలు నాటారు. శ్రీకాకుళం జిల్లాలో 68 వేలు, విజయనగరం జిల్లాలో 5.20 లక్షలు, విశాఖపట్నం జిల్లాలో 1.90 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 4.10 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.21 లక్షలు, గుంటూరు జిల్లాలో 3.10 లక్షలు, ప్రకాశం జిల్లాలో 5.10 లక్షల మొక్కలు నాటారు. నెల్లూరు జిల్లాలో 2.80 లక్షల మొక్కలు, వైఎస్సార్ కడప జిల్లాలో 2.60 లక్షలు, చిత్తూరు జిల్లాలో 1.20 లక్షలు, కర్నూలు జిల్లాలో 60 వేల మొక్కలు, అనంతపురం జిల్లాలో 8.70 లక్షల మొక్కలు నాటారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
Comments
Please login to add a commentAdd a comment