ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోవడంలోనూ రికార్డే! | Communist parties loss of deposits was also record In the 1967 election | Sakshi
Sakshi News home page

కామ్రేడ్లకు ఎదురుగాలి

Published Sat, Oct 27 2018 2:11 AM | Last Updated on Thu, Nov 1 2018 4:07 PM

Communist parties loss of deposits was also record In the 1967 election  - Sakshi

ప్రజాపోరాటాలతో పాలకులను కంటిమీద కునుకులేకుండా చేసిన సత్తా వారిది. ప్రజలకోసం ప్రజలద్వారా ఉద్యమాలు చేయించిన ఘన చరిత్ర వారిసొంతం. హక్కుల సాధన పేరుతో ప్రజలను చైతన్య పరిచిన గొంతుక వారిది. ఇదీ కమ్యూనిస్టుల పోరాటానికి నిదర్శనం. దేశమంతా కాంగ్రెస్‌ హవా నడుస్తున్నా.. తెలంగాణలో మాత్రం 1952 నుంచీ కాంగ్రెస్‌ను అడ్డుకుని కమ్యూనిస్టులు సత్తాచాటారు. ఒక దశలో కాంగ్రెస్‌ కంటే కాస్త వెనకబడ్డా.. కామ్రేడ్ల ప్రాభవం మాత్రం తగ్గలేదు. కానీ 1967 ఎన్నికల తర్వాత కామ్రేడ్ల పట్టు నెమ్మదిగా తగ్గడం మొదలైంది. 1964లో కమ్యూనిస్టులు చీలిపోయిన ప్రభావం.. 1967 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్రుల కన్నా తక్కువ సీట్లు సాధించారు. కామ్రేడ్ల చీలిక ప్రభావంతో బలమైన పునాదులున్న తెలంగాణలో, ఉద్యమాల ద్వారా పట్టు సాధించిన ఆంధ్ర ప్రాంతంలోనూ.. ఆ పార్టీ అస్తిత్వం కోల్పోయే స్థితికి వచ్చింది.

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతంలో కేవలం ఒక్క ఎంపీ సీటుకే పరిమితమైన కామ్రేడ్లకు తెలంగాణలో ఆ ఒక్కసీటు కూడా దక్కలేదు. శాసనసభ ఎన్నికల్లోనూ.. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 20 స్థానాలకు (సీపీఐ–11, సీపీఎం–9) కమ్యూనిస్టులు పరిమితమయ్యారు. తెలంగాణలో ఉభయ కమ్యూనిస్టులకు చెరో నాలుగు సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఈ ప్రభుత్వ హయాంలోనే తొలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. దీన్ని అణచివేసేందుకు కాసు సర్కారు ప్రయత్నించడం.. తదనంతర పరిణామాలతో.. తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు ప్రమాణస్వీకారం చేశారు. 


కాంగ్రెస్‌ ఏకఛత్రాధిపత్యం 
కామ్రేడ్లు పట్టుకోల్పోతుండగా.. కాంగ్రెస్‌ మాత్రం సత్తా చాటుతూ వచ్చింది. 1967 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇతరపార్టీలపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో (కర్ణాటక, కేరళతో సహా) దెబ్బతిన్నా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పట్టు నిలుపుకుంది. వరసగా నాలుగోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. 1967 ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ప్రాంతంలోని 13 ఎంపీ (మొత్తం 15 స్థానాల్లో) సీట్లతో పాటు, 64 ఎమ్మెల్యే (101 స్థానాల్లో) సీట్లను కాంగ్రెస్‌ గెలుచుకుంది. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ దక్కని వారంతా.. రెబెల్స్‌గా పోటీచేసి అత్యధికంగా 26 సీట్లలో గెలుపొందారు. ఈ ఎన్నికలు జరిగిన రెండేళ్లలోపే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. 1962లో ఆంధ్రప్రదేశ్‌లో 300 సీట్లకు (ఆంధ్రలో 194, తెలంగాణలో 106) సీట్లకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1967 శాసనసభ ఎన్నికల నాటికి 13 సీట్లు తగ్గి 287 సీట్లకు (ఆంధ్రలో 186, తెలంగాణలో 101) ఎన్నికలు నిర్వహించారు. ఉమ్మడి ఏపీలో ఎస్సీలకు 40, ఎస్టీలకు 11 స్థానాలు రిజర్వ్‌ చేశారు. వాటిలో తెలంగాణలో 16 ఎస్సీ సీట్లు, 4 ఎస్టీ సీట్లున్నాయి. 

తొలిసారి విడివిడిగా కామ్రేడ్లు 
కమ్యూనిస్టుల్లో చీలిక వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే. 1967 సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కామ్రేడ్లు విడివిడిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 8 జాతీయపార్టీల అభ్యర్థులతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు బరిలో నిలిచారు. కాంగ్రెస్‌తో సహా భారతీయ జనసంఘ్‌ (బీజేఎస్‌), సీపీఐ, సీపీఎం, ప్రజాసోషలిస్ట్‌ పార్టీ, భారతీయ రిపబ్లికన్‌ పార్టీ (ఆర్‌పీఐ), సంయుక్త సోషలిస్ట్‌ పార్టీ, స్వతంత్ర పార్టీ పోటీచేశాయి. 


తగ్గిన మహిళా ఎమ్మెల్యేలు 
1967లో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు కలిపి జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం 21 మంది మహిళలు పోటీపడగా, 11 మంది విజయం సాధించారు. వారిలో తెలంగాణ ప్రాంతం నుంచి 10 మంది బరిలో నిలవగా ఆరుగురు గెలిచారు. కాంగ్రెస్‌ నుంచి ఆరుగురు పోటీచేసి అయిదుగురు గెలుపొందారు. 

రిపబ్లికన్‌ పార్టీ (ఆర్పీఐ) అధ్యక్షురాలు జెట్టి ఈశ్వరీబాయి ఎల్లారెడ్డి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి గెలిచారు. భారతీయ జనసంఘ్‌ అభ్యర్థులు రెండుసీట్లలో పోటీచేయగా పాలేరు (ఎస్సీ)లో డిపాజిట్‌ దక్కలేదు. స్వతంత్ర పార్టీ టికెట్‌పై యాకుత్‌పుర నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన ఎన్‌ బేగం డిపాజిట్‌ కూడా గల్లంతైంది. 

ఎమ్మెల్యేగా ప్రముఖుల జయాపజయాలు 
నరసాపూర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా సి.జగన్నాథరావు సీపీఐనేత చిలుముల విఠల్‌ రెడ్డిపై గెలిచారు. సిద్ధిపేట నుంచి వల్లూరు బసవరాజు (వీబీ రాజు) విజయం సాధించారు. ఎల్లారెడ్డి (ఎస్సీ) సీటు నుంచి ఆర్‌పీఐ అధ్యక్షురాలు జెట్టి ఈశ్వరీబాయి, మంత్రి, కాంగ్రెస్‌ అభ్యర్థి టీఎన్‌ సదాలక్ష్మిని ఓడించారు. కాంగ్రెస్‌ నేత జేవీ నరసింగరావు లక్షెట్టిపేట నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన టీఆర్‌ రావుపై గెలుపొందారు. మంథని నుంచి పీవీ నరసింహారావు (కాంగ్రెస్‌) మూడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కరీంనగర్‌ నుంచి జువ్వాడి చొక్కారావు (కాంగ్రెస్‌).. నేరెళ్ల (ఎస్సీ) నుంచి గొట్టె భూపతి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా గెలిచారు.1962లో వేంసూర్‌ నుంచి గెలిచిన జలగం వెంగళరావు, 1967లోనూ కాంగ్రెస్‌ టికెట్‌పై ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 1967లో ఖమ్మం నుంచి సీపీఎం టికెట్‌పై గెలిచిన మహ్మద్‌ రజబ్‌ అలీ, ఆ తర్వాత సీపీఐలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.


తుంగతుర్తి నుంచి సీపీఎం అభ్యర్థిగా తెలంగాణ సాయుధపోరాట యోధుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి గెలిచారు. ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి తిరువరంగం హయగ్రీవాచారి (కాంగ్రెస్‌)పై స్వతంత్ర అభ్యర్థి టీఎల్‌ రెడ్డి విజయం సాధించారు. సీనియర్‌ నేత, కాంగ్రెస్‌ నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ భువనగిరిలో విజయబావుటా ఎగరేశారు. మునుగోడు నుంచి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా.. సీపీఐ నేత ఉజ్జిని నారాయణరావుపై గెలుపొందారు. చెన్నూర్‌ (ఎస్సీ) సీటు నుంచి కాంగ్రెస్‌ నేత కోదాటి రాజమల్లు ఎన్నికయ్యారు. మజ్లిస్‌ అభ్యర్థి సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ చార్మినార్‌ స్థానం నుంచి బీజేఎస్‌ ప్రతినిధి సీఎల్‌ మేఘ్‌రాజ్‌పై గెలిచారు. ఆసిఫ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి ఎంఎం హాషీం కాంగ్రెస్‌ టికెట్‌పై విజ యం సాధించారు. సంయుక్త సోషలిస్ట్‌పార్టీ అభ్యర్థిగా బద్రీవిశాల్‌ పిత్తీ మహారాజ్‌గంజ్‌ స్థానం నుంచి ఎన్నికయ్యారు. కార్మికనేత టి.అంజయ్య 1967లో మరోసారి ముషీరాబాద్‌ స్థానాన్ని నిలుపుకున్నారు. అచ్చంపేట (ఎస్సీ)  నుంచి పుట్టపాగ మహేంద్రనాథ్‌ (కాంగ్రెస్‌) మరోసారి గెలవగా.. జనగాం నుంచి కాంగ్రెస్‌నేత మహ్మద్‌ కమాలుద్దీన్‌ అహ్మద్‌ సీపీఎం అభ్యర్థి ఈఎన్‌రెడ్డిని ఓడించారు. 1969లో కల్వకుర్తి స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో సూదిని జైపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 

ఏకగ్రీవమైన ముగ్గురూ కాంగ్రెస్‌ నేతలే 
జగిత్యాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎల్‌ఎన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ నేత గడ్డం (అరుగుల) రాజారామ్‌ పోటీ లేకుండానే గెలుపొందారు. 1968లో జరిగిన ఉప ఎన్నికల్లో బుగ్గారం (ఎస్టీ) సీటు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి కె.రామయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎంపీలుగా గెలిచిన ప్రముఖులు స్వతంత్ర పార్టీ నుంచి గౌతు లచ్చన్న (శ్రీకాకుళం), ప్రముఖ సినీనటుడు కొంగర జగ్గయ్య ఒంగోలు నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై ఎన్నికయ్యారు. సీపీఎం అభ్యర్థి మాదాల నారాయణస్వామిని జగ్గయ్య ఓడించారు. గుంటూరు నుంచి గెలిచిన కొత్త రఘురామయ్య ఇందిరాగాంధీ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. హిందూపురం నుంచి నీలం సంజీవరెడ్డి, నంద్యాల నుంచి పెండేకంటి వెంకట సుబ్బయ్య గెలిచారు. విజయవాడ నుంచి కేఎల్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు నుంచి స్వతంత్రపార్టీ అభ్యర్థిగా పోటీచేసిన వైజీ లింగన్న గౌడ.. కాంగ్రెస్‌నేత దామోదరం సంజీవయ్యను ఓడించారు. సిద్ధిపేట (ఎస్సీ) ఎంపీ స్థానం నుంచి జి. వెంకటస్వామి, మెదక్‌ నుంచి సంగెం లక్ష్మీబాయి కాంగ్రెస్‌ ఎంపీలుగా గెలిచారు. ఖమ్మం నుంచి తేళ్ల లక్ష్మీకాంతమ్మ, హైదరాబాద్‌ నుంచి జీఎస్‌ మెల్కోటేలు కూడా హస్తం గుర్తుపైనే పార్లమెంటుకు ఎన్నికయ్యారు.  

కేబినెట్‌లో చెన్నారెడ్డి.. సహాయ మంత్రిగా పీవీ 
1967 ఎన్నికల్లో గెలిచాక కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో తెలంగాణ ప్రాంతం నుంచి కేబినెట్‌ మంత్రులుగా డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి, వల్లూరి బసవ రాజు, జేవీ నరసింగరావు, కొండా లక్ష్మణ్‌ బాపూజీ పనిచేయగా.. పీవీ నరసింహారావు, బీవీ గురుమూర్తి, శీలం సిద్ధారెడ్డి, మహ్మద్‌ ఇబ్రహీం అలీ ఖాన్, అరిగె రామస్వామి సహాయమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. 1969లో బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గ విస్తరణలో జలగం వెంగళరావు కేబినెట్‌ మంత్రిగా చేరారు. అప్పుడే పీవీకి కూడా కేబినెట్‌ హోదా దక్కింది. 

కీలక చట్టాలకు ఆమోదం 
1968 ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ప్రిమైసెస్‌ (ప్రభుత్వస్థలాల నుంచి ఆక్రమణదారులను తొలగించేందుకు) యాక్ట్‌ – 1968, ఆంధ్ర ప్రదేశ్‌ ఎక్సైజ్‌ చట్టాలకు ఆమోదం లభించింది. కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలోనే కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మద్యనిషేధాన్ని ఎత్తేస్తారు. రాష్ట్రంలో హెచ్‌ఎంటీ, ఐడీపీఎల్, హిందుస్థాన్‌ కేబుల్స్, బీహెచ్‌ఈఎల్‌ తదితర ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ కాలంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం డిమాండ్‌ పెరగడంతో పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు ఊపందుకున్నాయి. 1969లో తెలంగాణ ఉద్యమం తారస్థాయికి చేరుకోవడంతో కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం బలప్రయోగంతో అణచేసింది. 

ఏపీలో తొలి తెలంగాణ సీఎం పీవీ 
1971 సెప్టెంబర్‌ 30న ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ తొలి సీఎంగా పీవీ నరసింహారావు ప్రమాణం చేశారు. పీవీ మంత్రిమండలిలో జలగం వెంగళరావుకు చోటు దక్కలేదు. అదే సామాజికవర్గానికి చెందిన జె.చొక్కారావును కేబినెట్‌లోకి తీసుకున్నారు. కాగా, స్వాతంత్య్ర సమరయోధుడు బొల్లవరపు వెంకట సుబ్బారెడ్డి 1962 నుంచి 1967 వరకు.. ఆ తర్వాత 1967 నుంచి 70 వరకు శాసనసభ సభాపతిగా కొనసాగారు. డిప్యూటీ స్పీకర్‌గా వాసుదేవ్‌ కృష్ణాజీ నాయక్‌ పదేళ్లపాటు (1962 నుంచి 72 దాకా) ఉన్నారు. 

లోక్‌సభలోనూ కాంగ్రెస్‌ ప్రభంజనం 
1967లో ఏపీలోని 41 సీట్లకు (జనరల్‌–33, ఎస్సీ–6, ఎస్టీ– 2 స్థానాలు) లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఏపీలో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 35 సీట్లు గెలుపొంది ప్రత్యర్థి పార్టీలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. స్వతంత్ర పార్టీ 3, ఇండిపెండెంట్లు 2సీట్లు గెలుచుకున్నారు. ఇందులో ఏపీలోని 26 స్థానాల్లో కాంగ్రెస్‌ 21 సీట్లు, స్వతంత్రపార్టీ 3 స్థానాల్లో గెలవగా.. సీపీఐ, ఇండిపెండెంట్‌లకు చెరో సీటు దక్కింది. సీపీఐ కేవలం ఒక్క సీటుకే (కడప నుంచి ఎద్దుల ఈశ్వరరెడ్డి) పరిమితమైంది. విశాఖపట్టణం నుంచి ఇండిపెండెంట్‌గా తెన్నేటి విశ్వనాథం గెలిచారు. తెలంగాణలోని 15సీట్లలో 14 చోట్ల కాంగ్రెస్‌ గెలవగా.. నిజామాబాద్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎం.నారాయణ రెడ్డి గెలిచారు. భద్రాచలం (ఎస్టీ)సీటు నుంచి బీకే రాధాబాయి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. 

డిపాజిట్లు గల్లంతు.. 
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 287 సీట్లలో కాంగ్రెస్‌ పోటీచేసింది. 165 స్థానాల్లో నెగ్గిన ఆ పార్టీ 7 సీట్లలోనే డిపాజిట్లు కోల్పోయింది. 11 సీట్లలో పోటీచేసిన ఆర్పీఐ తెలంగాణలో ఒక సీట్లో గెలవగా మిగతా పదిచోట్ల ధరావతు కోల్పోయింది. 104 సీట్లకు పోటీచేసిన సీపీఐ 47 చోట్ల, 83 స్థానాల్లో అభ్యర్థులు నిలిపిన సీపీఎం 26 చోట్ల డిపాజిట్లు కోల్పోయాయి. బీజేఎస్‌ 80 సీట్లకు పోటీచేయగా.. 69 చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. 401 మంది ఇండిపెండెంట్లు పోటీచేయగా.. 241 మందికి డిపాజిట్‌ దక్కలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement