
రాష్ట్రమంత్రి సుజయ్, కేంద్రమంత్రి అశోక్
మనం మౌనం వహిస్తున్నాం... వారు దూకుడు పెంచుతున్నారు. మనం ప్రతిపాదనలే తయారు చేశాం. వారు అమలు చేసి చూపిస్తున్నారు. మనం చూద్దాంలే అనే ధోరణిలో ఉన్నాం.. వారు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇదీ కొఠియాపై మనరాష్ట్ర పాలకులు... పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్ర పాలకులకు ఉన్న తేడా. ఈ పరిస్థితి అసలు గ్రామాలనే కాదు... అక్కడి ఖనిజ సంపదనూ కోల్పోయేందుకు దారితీస్తోంది. పాపం అధికారులు ఎంతవరకు సాగగలరు? మన పెద్దల మౌనం చూస్తుంటే... కావాలనే దానిని వారికి వదిలిపెట్టే యత్నం సాగుతోందేమోనన్న అనుమానాలకు తావిస్తోంది.
సాక్షిప్రతినిధి, విజయనగరం: ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోని ఇరవై ఒక్క కొఠియా పల్లెల్లో ఒడిశా ప్రభుత్వం అభివృద్ధి పనులు శరవేగంగా చేసుకుపోతోంది. ఆ ప్రాంతం తమదేనని గట్టిగా వాదిస్తోంది. ఒక్కసారి ఆంధ్రా కలెక్టర్ పర్యటించినందుకే ఒడిశా కలెక్టర్‌పై వేటు వేసింది. వివాదం పరిష్కారానికి నిపుణుల కమిటీ వేస్తూనే రూ.కోట్ల విలువైన పనులు మంజూరు చేసింది. ఆంధ్రా సరిహద్దులో చెక్‌పోస్ట్ పెట్టి కొఠియాకు బస్సులు వేసింది. ఇంత జరుగుతున్నా మన రాష్ట్ర పాలకుల్లో ఏ మాత్రం చలనం లేదు. అధికారులు వెళ్లి రూ.2 కోట్లతో పనులు చేస్తామని గిరిజనులకి చెప్పొచ్చారు. కాని ఒడిశా ఆ పనులు ముందే మొదలు పెట్టేస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారులు దీనిపై మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు స్వయంగా ఆ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మనవైపు నుంచి మాత్రం జిల్లాలో ఉన్న కేంద్ర, రాష్ట్ర మంత్రుల్లో ఒక్కరూ నోరుమెదపడం లేదు. రాష్ట్ర స్థాయి సమస్య అయినప్పటికీ సీఎం ఇంత వరకూ ఒక్క ప్రకటనైనా చేయలేదు.
పట్టు బిగిస్తున్న ఒడిశా...
సాలూరు మండలంలో పట్టుచెన్నేరు, పగలుచెన్నేరు, తోణాం, గంజాయిభద్ర, సారిక తదితర పంచాయతీల్లో సుమారు 21 వివాదాస్పద గిరిశిఖర గ్రామాలున్నాయి. వీటినే కొఠియా పల్లెలుగా పిలుస్తున్నారు. ఇక్కడి ప్రజల దుర్భర జీవన స్థితిగతులను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చింది. మన జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ, ఇతర ముఖ్య అధికారులు ఈ గ్రామాల్లో పర్యటించి ప్రాధమికంగా పలు సంక్షేమ ఫలాలు అందించి వచ్చారు. త్వరలోనే అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ పరిణామంతో ఒడిశా ప్రభుత్వంలో పెను తుఫాను రేగింది. అక్కడి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేయాలనే డిమాండ్ లేచింది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా దృష్టిసారించారు. జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేసి తెలుగు తెలిసిన వ్యక్తిని కలెక్టర్‌గా నియమించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే కొఠియా గ్రామాల్లో పర్యటించారు. అభివృద్ధి మంత్రంతో గిరి నులకు చేరువయ్యేందుకు అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి సౌకర్యాలు, సోలార్‌లైట్ల ఏర్పాట్లు, గృహాలు, రహదారులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, శ్మశాన వాటికలు, రేషన్ పంపిణీ, పింఛన్లు మంజూరు, బస్సు సౌకర్యం ఇలా అనేక అభివృద్ధి, సంక్షేమ పనులు చేపడుతున్నారు.
గిరిజనుల అభీష్టమే అంతిమ నిర్ణయం
కొఠియా పల్లెలు అభివృద్ధికి దూరమైనా... అపార ఖనిజ సంపదకు నిలయాలు. అక్కడి కొండల్లో అధికంగా మాంగనీస్, ఇనుప ఖనిజం, రంగురాళ్లు వంటి విలువైన ఖనిజ నిక్షేపాలున్నాయి. వీటి విలువ కొన్ని లక్షల కోట్లల్లో ఉంటుంది. వీటిని దక్కించుకుంటే ఆ రాష్ట్రం ఆర్థికంగా అందనంత ఎత్తుకు ఎదుగుతుందనే వాదనలు ఉన్నాయి. వీటిని పొందాలంటే ముందు ఈ గ్రామాల ప్రజలను మచ్చిక చేసుకోవాలి. కొఠియా పల్లెలకు సంబంధించిన వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. అధిక శాతం ప్రజల అభీష్టం మేరకే వారిని ఏ రాష్ట్రానికివ్వాలనేదానిపై కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఒడిశా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గిరిజనులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇక్కడ సంక్షే మ, అభివృద్ధి పథకాలు చురుగ్గానే మంజూరయ్యాయి. అప్పు డు గిరిజనులు ఆంధ్రా ప్రాంతం వైపే మొగ్గు చూపేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తమను ఎవ్వరూ పట్టిం చుకోవడం లేదని, ఒడిశా బాగా చూసుకుంటోందని గిరిశిఖర గ్రామాల ప్రజలు అంటున్నారు.
వాటాల కోసమేనా...ః మన రాష్ట్రంలో గనుల తవ్వకాలపై ఉన్నన్ని ఆంక్షలు ఒడిశాలో లేవు. అంతే కాదు.. మన రాష్ట్ర టీడీపీ నేతల్లో చాలామందికి ఒడిశాతో వ్యాపార సంబంధాలున్నాయి. ఇదే ఇక్కడి పాలకులు కొఠియా గ్రామాలపై పెదవి విప్పకపోవడానికి ప్రధాన కారణమనే ప్రచారం జరుగుతోంది. ఈ గ్రామాలను ఒడిశాకు వదిలేస్తే ఆ ప్రభుత్వం చేపట్టే మైనింగ్ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలు పంచుకుని వాటాలు వెనకేసుకోవాలనే కుటిల నీతితోనే టీడీపీ వర్గీయులెవరూ ఆ పల్లెలు ఆంధ్రాకే కావాలని అడగడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజాని కి కొఠియా వివాదాన్ని పార్లమెంట్‌లో తెల్చుకోమని సుప్రీం కోర్టు చెప్పింది. ఆ దిశగా జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి ఆశోక్ గజపతిరాజు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. అక్కడి గనులపై ఒడిశా కన్ను పడిం దని తెలిసినా జిల్లాలోనే ఉంటున్న రాష్ట్ర గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారా వు లో చలనం లేదు. ఒడిశా సీఎం స్వయంగా రంగంలోకి దిగి అక్కడి అధికారులను పరుగులు పెట్టిస్తున్నా మన ముఖ్యమంత్రి కొఠియా మాదంటూ కనీసం ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఇవన్నీ చూస్తుంటే కావాలనే మంత్రుల దగ్గర్నుంచి, సీఎం వరకూ నిర్లక్ష్యం వహిస్తున్నారనిపిస్తోంది. ఈ వైఖరి ఇలానే కొనసాగితే ‘మాకు ఒడిశా కావాలి.. ఆంధ్రా వద్దు’ అని ఆ గిరిజనులు చెప్పడం ఖాయం.
వివక్షను విడనాడాలి
గిరిజనులపై వివక్షను టీడీపీ నేతలు విడనాడాలి. వివాదా స్పద కొఠియా గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలు మంజూరు చేయకపోవడం వల్లనే వారు ఒడిశా వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇప్పటికే విభజనాంధ్రప్రదేశ్ ఆర్ధికంగా చితికిపోయింది. ఇప్పుడు విలువైన ఖనిజ సంపద ఉన్న కొఠియాను కూడా కోల్పోతే మరిన్ని ఇబ్బందులు తప్పవు.
–సంగంరెడ్డి జయసింహ, ఉపాధ్యక్షుడు, అఖిలభారత ఆదివాసీ వికాస పరిషత్, విజయనగరం జిల్లా
గిరిజనులంటే చిన్నచూపు
టీడీపీ నేతలకు గిరిజనులంటే చిన్నచూపు. వారి కష్టాలను, బాగోగులకు ఎప్పుడూ పట్టించుకోదు. కొఠియా గ్రామాల్లో ఉన్నది గిరిజనులు కావడం వల్లనే వారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అంతేకాదు, అక్కడి కొండల్లో ఉన్న ఖనిజ సంపదను ఒడిశా ప్రభుత్వమైతేనే ఎలాంటి అడ్డంకులు లేకుండా తవ్వుకోనిస్తుంది. టీడీపీ నేతల్లో కొందరికి అక్కడ వ్యాపారులన్నాయి. వారే మన రాష్ట్రంలో కంటే సులభంగా గనుల తవ్వకాల కాంట్రాక్టులు ఒడిశాలో పొందే అవకాశం ఉంది. దాని ద్వారా ఇక్కడి పాలకులకు వాటా లు అందుతాయి. ఈ కారణాలతోనే కొఠియా పల్లెలను ఒడిశాకు వదిలేసే కుట్ర జరుగుతోంది. అందుకే ఎవరూ దీనిపై మాట్లాడట్లేదనిపిస్తోంది. – రాజన్న దొర, ఎమ్మెల్యే, సాలూరు.
Comments
Please login to add a commentAdd a comment