బెజవాడ టీడీపీలో మంటలు.. కొత్త చిచ్చు రగులుకుంది.. | Bezawada Politics: Group War In Vijayawada TDP | Sakshi
Sakshi News home page

బెజవాడ టీడీపీలో మంటలు.. కొత్త చిచ్చు రగులుకుంది..

Published Sat, Sep 24 2022 5:38 PM | Last Updated on Sat, Sep 24 2022 7:14 PM

Bezawada Politics: Group War In Vijayawada TDP - Sakshi

సాక్షి, విజయవాడ: ఆ జిల్లా ఒకప్పుడు తెలుగుదేశానికి కంచుకోట. క్రమంగా అక్కడి కోటలన్నీ బీటలు వారాయి. పైకి వీర విధేయులమనే చెప్పుకుంటున్నారు కానీ ఏమాత్రం తేడా కొట్టినా ఝలక్ ఇస్తుంటారు. ఇదీ బెజవాడలో సైకిల్‌ పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణం మీరంటే.. మీరంటూ పచ్చ పార్టీ నాయకుల మధ్య కొట్లాట మొదలైంది. ఈ తగాదాలతో నేతల మధ్య మొదలైన గ్యాప్ బాగా పెరిగిపోయింది. ఫలితంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వర్సెస్ బుద్ధా వెంకన్న, బోండా ఉమా, నాగుల్ మీరా అనేలా పరిస్థితులు మారాయి. కొంతకాలం క్రితం తనకు సరైన గౌరవం దక్కడం లేదని కేశినేని నాని అలకబూనారు.
చదవండి: అచ్చెన్నకు లోకేష్‌తో చెడిందా?.. చినబాబుకు కళా అందుకే దగ్గరవుతున్నారా?

దీంతో చంద్రబాబే ఒక మెట్టు దిగి వచ్చి కేశినేని నానిని బుజ్జగించడంతో పాటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలను కూడా అప్పగిస్తూ ఆ నియోజకవర్గానికి ఇంఛార్జిగా నియమించారు. ఐతే ఈ నిర్ణయాన్ని అప్పట్లో బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇక అప్పట్నుంచి కేశినేని నాని, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారాయి పరిస్థితులు.

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో కేశినేని నాని తమ్ముడు కేశినేని శివనాధ్ ఆలియాస్ చిన్ని బెజవాడ పాలిటిక్స్‌లో చురుగ్గా ఉండటంతో పార్టీలో కొత్త చిచ్చు రగులుకుంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుండటం కేశినేని నానికి ఇబ్బందిగా మారింది. ఇదంతా తనను పార్టీలోంచి పొమ్మనలేక పొగబెట్టడానికే అని కేశినేని నాని బలంగా నమ్మడంతో చంద్రబాబుతో టచ్ మీ నాట్ అనేలా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు సైతం కేశినేని నాని దూరంగా ఉన్నారు. అలాగే పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనడం లేదు. ఇక తన అసహనాన్ని, అసంతృప్తినంతా సోషల్ మీడియా వేదికగా పంచుకుని పార్టీలో తీవ్ర చర్చకు తెర తీశారు కేశినేని నాని.

ఇలా వరుస పరిణామాలతో పార్టీ అధినేతకే తలబొప్పి కట్టేట్లు చేశారు నాని. చంద్రబాబుకు ఇటీవల ఢిల్లీ వెళ్ళినపుడు అక్కడే ఉన్న కేశినేని నాని బొకే ఇవ్వడానికి కూడా నిరాకరించి అటు అధినేతను.. ఇటు పార్టీ శ్రేణులను నివ్వెరపోయేలా చేశారు. ఇలా తరచూ అలిగే నానితోనే వేగలేకపోతున్న చంద్రబాబుకు తాజాగా ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశాలు మరో తలనొప్పి తెచ్చిపెట్టాయట. ఈ సారి విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచి తీరుతామని పదే పదే చెప్పే కేశినేని నాని ఈ సమావేశాలకు హాజరు కాలేదు. ఇక హాజరైన నేతల్లో కొందరికి సరైన గౌరవం దక్కక పోవడం కూడా ఇప్పుడు పార్టీలో చర్చకు దారితీసింది.

విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన బుద్ధా వెంకన్న స్టేజ్ మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో లేకపోవడం చూసి షాక్ తిన్నారు. తన ఫోటో పెట్టకపోవడంతో స్టేజ్ మీదకు పిలిచినా వెళ్లలేదు. కొల్లు రవీంద్ర స్వయంగా వచ్చి ఆహ్వానించినా బుద్ధా వెంకన్న ససేమిరా కుదరదని తేల్చేశాడు. తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుని ఇక అక్కడ ఉండలేక వైజాగ్ లో పనుందంటూ సమావేశం నుంచి బయటికి వచ్చేశాడు బుద్ధా.

అక్కడి పరిస్థితులు చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని.. చంద్రబాబు కోసం ప్రాణం ఇచ్చే నాలాంటి వారికే ఇలా జరిగితే ఎలా అనుకుంటూ నాగుల్ మీరాతో కలిసి సమావేశాన్ని బాయ్ కాట్ చేసి వెళ్లిపోయాడు బుద్ధా వెంకన్న. ఈ పరిణామాలను ఊహించని నేతలంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. బుద్ధా వెంకన్నకు జరిగిన అవమానంతో పశ్చిమ నియోజవర్గ టీడీపీ శ్రేణులు అసంతృప్తితో రగిలిపోతున్నారట. నాగుల్ మీరా సైతం ఈసారి తనకు టిక్కెట్ ఇస్తే సరేసరి లేకపోతే పార్టీ మారిపోవడానికైనా నేను సిద్ధం అంటూ తెగేసి చెప్పేశారట. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement