గెలుపు చిదంబర రహస్యం | Congress and Bjp Faces Tough Fight in Sivaganga Lok Sabha Elections | Sakshi
Sakshi News home page

గెలుపు చిదంబర రహస్యం

Published Sun, Apr 14 2019 4:57 AM | Last Updated on Sun, Apr 14 2019 10:18 AM

Congress and Bjp Faces Tough Fight in Sivaganga Lok Sabha Elections - Sakshi

హెచ్‌.రాజా కార్తి చిదంబరం

తమిళనాడులో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ప్రత్యక్ష పోటీ ఉన్న రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒకటి శివగంగ. కాంగ్రెస్‌ సీని యర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు, ప్రస్తుత కాంగ్రెస్‌ అభ్యర్థి కార్తీ చిదంబరం కిందటి ఎన్నికల్లో నాలుగో స్థానం లో నిలిచారు. మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ అభ్యర్థి హెచ్‌.రాజా మళ్లీ పోటీలో ఉన్నా రు. వీరిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ ఉండనుంది. 2014లో గెలిచిన ఏఐఏడీఎంకే నేత పీఆర్‌ సెంథిల్‌నాథన్, రెండో స్థానంలో ఉన్న డీఎంకే అభ్యర్థి దురై రాజ్‌ సుభా పొత్తుల కారణంగా పోటీ చేయడం లేదు.

రాష్ట్రంలో రెండు కూటములకు నాయకత్వం వహిస్తున్న పాలక ఏఐఏడీఎంకే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే తమ మిత్రపక్షాలకు ఈసారి శివగంగ సీటును కేటాయిం చాయి. కిందటి ఎన్నికల ముందు పి.చిదంబరం రాజ్యసభకు ఎన్నికవడంతో తొలిసారి లోక్‌సభకు పోటీచేయలేదు. మొదటిసారి ఎన్నికల బరిలో దిగిన ఆయన కొడుకు కార్తి ఓడిపోయారు. గత ఐదేళ్లలో ఆర్థిక నేరాలకు సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతున్న కార్తి ఇప్పుడు రెండోసారి గెలుపు కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఏఐఏడీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ అభ్యర్థి హెచ్‌.రాజాకు వివాదాస్పద ప్రకటనలతో సంచలనం సృష్టించే నేపథ్యం ఉంది.
 
నోటి దురుసు నేత రాజా
రెండు దశాబ్దాల క్రితం శివగంగలో కాంగ్రెస్‌ అభ్యర్థికి రాజా గట్టి పోటీ ఇచ్చినా ఆయన నోటి దురుసు వల్ల జనాదరణ కోల్పోయారు. పాలకపక్షమైన ఏఐఏడీఎంకేతో పొత్తు ఉన్నా ఆయన ఇమేజ్‌ కారణంగా ఆయన అభ్యర్థిత్వానికి బీజేపీ కార్యకర్తలు మొదట అంత అనుకూలంగా లేరు. ఇటీవల రాజా తమిళులంతా గౌరవించే పెరి యార్‌ ఈవీ రామస్వామి నాయకర్, మైనారిటీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పోలీసులతో గొడవపడిన సమయంలో ఆయన మద్రాసు హైకోర్టుపైన, శబరిమల ఆలయ ప్రవేశ వివాదంలో అన్ని వయసుల మహిళలపై కూడా అసభ్యకరమైన రీతిలో మాట్లాడారు.

ఇలాంటి కరుడుగట్టిన హిందుత్వ రాజకీయాలు నడిపే నేత అభ్యర్థి అయితే ఓటర్లను ఆకట్టకోలేమని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్‌ అభ్యర్థి కార్తిపై ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులుండటంతో ఇద్దరు వివాదాస్పద నేతల మధ్య పోటీ జరుగుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా కార్తి పేరు ప్రకటించడంలో జరిగిన ఆలస్యం కూడా కాంగ్రెస్‌ శ్రేణులను ఆందోళనకు గురి చేసింది. ఎయిర్‌సెల్‌–మాక్సిస్, ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుల్లో నిందితుడైన కార్తి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌ మాజీ ఎంపీ నాచయప్పన్‌ అభ్యంతరం చెప్పడంతో ఆయనకు శివగంగ టికెట్‌ ఇవ్వడంలో కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం జాప్యం చేసింది. చాలా కాలంగా తన కేసులకు సంబంధించి ముఖ్యంగా బెయిలు కోసం వేసిన పిటిషన్ల కారణంగా కార్తి వార్తల్లో ఉంటున్నారు.

వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం
రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన శివగంగలో రైతులు కష్టాల్లో మునిగి ఉన్నారు. వరి, చెరకు, పత్తి, మిరప, వేరు శనగ పండించే ఈ ప్రాంతంలోని రైతులు సాగు నీటి సమస్యతోపాటు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు. చెరకు పం టకు కనీస మద్దతు ధర తగినంత లేకపోవడం, సాగునీటి కొరత వల్ల పంట విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. మోదీ ప్రభుత్వం ప్రకటించిన పంటల బీమా పథకం ఇక్కడి రైతులను ఆదుకోలేకపోతోంది. చెరువుల్లో పూడిక తీయకపోవడం వల్ల ప్రజలు తాగు నీరులేక అల్లాడుతున్నారు. నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో అవకాశాలున్నా అలాంటి ప్రయత్నాలు జరగటం లేదు. సున్నపురాయి, గ్రానైట్, గ్రాఫైట్‌ వంటి ఖనిజ నిక్షేపాలు ఇక్కడ సమృద్ధిగా ఉన్నా రైలు, రోడ్డు రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పరిశ్రమల స్థాపన జరగడం లేదు. శివగంగ సమీపంలో తమిళనాడు మినరల్‌ లిమిటెడ్‌ కార్యాలయం ఉంది కానీ మైనింగ్‌ కార్యకలాపాలు పెరగడం లేదు. ఈ నేపథ్యంలో యువకులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు.
  
పాలకపక్షాలపై వ్యతిరేకత బీజేపీకి అననుకూల అంశం..
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో దాని మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే అధికారంలో ఉండడంతో జనంలో పాలకపక్షాలపై వ్యతిరేకత హద్దులు దాటితే అదిక్కడ బీజేపీ అభ్యర్థికి అననుకూలం కావచ్చు. మందకొడిగా ప్రారంభమైన ఎన్నికల ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. తన కొడుకు కార్తి గెలుపు కోసం చిదంబరం శివగంగలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నా రు. చిదంబరం దశాబ్దాల పాటు శివగంగ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్నా నియోజకవర్గానికి ఏం చేయలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్‌ పార్టీ అమ్మా మక్కల్‌ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) అభ్యర్థి కూడా రంగంలో ఉండడంతో హిందువుల ఓట్లలో వచ్చే చీలిక బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయవచ్చు. ఇక్కడి తేవర్ల ఓట్లు గణనీయంగానే ఈ పార్టీకి పడవచ్చని  పరిశీలకుల అంచనా. కార్తి గెలుపు ఆయ న తండ్రి చిదంబరానికి అత్యంత ప్రతిష్టాత్మకరంగా మారింది.

తండ్రి కంచుకోటలో కొడుకుకు పరీక్ష
1967లో ఏర్పడిన శివగంగ నుంచి చిదంబరం ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యా రు. టీఎంసీ తరఫున పోటీ చేసిన 1999లో ఒక్కసారే ఆయన ఇక్కడ ఓడిపోయారు. ఐదుసార్లు కాంగ్రెస్‌ టికెట్‌పై, రెండుసార్లు టీఎంసీ తరఫున విజయం సాధించారు. 1999లో చిదంబరాన్ని కాంగ్రెస్‌ అభ్యర్థి ఈఎం సుదర్శన్‌ నాచయప్పన్‌ ఓడించారు. ఆరు అసెంబ్లీ సెగ్మెం ట్లు ఉన్న శివగంగలో మొత్తం ఓటర్లు 11,07, 575. ఇక్కడ పోలింగ్‌ ఏప్రిల్‌ 18న జరుగుతుం ది. టీఎంసీతోపాటు ప్రధాన ప్రాంతీయ పక్షాలైన డీఎంకే, ఏఐఏడీఎంకే రెండేసిసార్లు ఇక్కడ గెలుపొందాయి. బీజేపీ అభ్యర్థి రాజా 1999లో 2,22,668 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలి చారు. ప్రస్తుతం బీజేపీ నుంచి రాజా బరిలోకి దిగగా, కాంగ్రెస్‌ నుంచి కార్తి చిదంబరం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement