ఏఎంఎంకే నేతల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో ఓటర్లకు పంచేందుకు దాచిన నగదును అధికారులు స్వాధీనం చేసుకునే క్రమంలో పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. అధికారుల తనిఖీల్లో రూ.1.48 కోట్ల నగదు పట్టుబడింది. ఈ ఘటనలో టీటీవీ దినకరన్‌కు చెందిన అమ్మ మక్కల్ మున్నెట్ర కళగం(ఏఎంఎంకే) పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. తమిళనాడులో 38 ఎంపీ స్థానాల పోలింగ్‌తోపాటు 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ఉన్నాయి. తేని జిల్లా ఆండిపట్టి అసెంబ్లీ స్థానం వాటిలో ఒకటి. ఆండిపట్టిలో ఓటర్లకు పంచేందుకు ఏఎంఎంకే నాయకులు రూ. 2 కోట్లను ఏప్రిల్ 16న పట్టణానికి తీసుకొచ్చి ఓ నేత ఆఫీస్‌లో దాచారు.
డబ్బును అనేక ప్యాకెట్లలోకి చేర్చి, ఏ ప్యాకెట్‌ను ఏ వార్డుకు పంపాలో రాశారు. సమాచారం అందుకున్న ఆదాయపు పన్ను విభాగం (ఐటీ), ఎన్నికల సంఘం అధికారులు మంగళవారం పొద్దుపోయాక అక్కడికి చేరుకుని సోదాలు చేసేందుకు ప్రయత్నించారు. ఏఎంఎంకే కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యకర్తలు డబ్బు దాచిన కార్యాలయం తలుపులు పగులగొట్టి నగదును తీసుకెళ్లిపోతుండటంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. రూ. 2 కోట్లలో కార్యకర్తలు రూ. 52 లక్షలు తీసుకెళ్లగా, రూ. 1.48 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment