చెన్నైలో మీడియాతో మాట్లాడుతున్న స్టాలిన్, ముకుల్ వాస్నిక్, కేఎస్ అళగిరి తదితరులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: దక్షిణ భారతదేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల కోసం డీఎంకే, కాంగ్రెస్‌ల మధ్య మళ్లీ పొత్తు కుదిరింది. డీఎంకే నేతృత్వంలోని ఆ కూటమిలో కాంగ్రెస్‌కు కేటాయించే సీట్ల పంపకాలపై బుధవారం స్పష్టమైన ప్రకటన వచ్చింది. తమిళనాడులో మొత్తం 39 స్థానాలుండగా 9 చోట్ల కాంగ్రెస్ పోటీకి దిగనుంది. మిగిలిన 30లో మరికొన్ని సీట్లను కూటమిలోని ఇతర పార్టీలకు డీఎంకే కేటాయించాల్సి ఉంది. అటు పుదుచ్చేరిలోని ఒక్క సీటును కూడా కాంగ్రెస్‌కే డీఎంకే విడిచిపెట్టింది. దీంతో తమిళనాడు, పుదుచ్చేరిల్లోని మొత్తం 40 స్థానాలకుగాను 10 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేయనుంది. ప్రస్తుతం పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తమిళనాడులో ఒంటరి పోరుకు దిగింది. ఆ ఎన్నికల్లో అటు డీఎంకే కానీ, ఇటు కాంగ్రెస్ కానీ ఒక్కటంటే ఒక్క సీటును కూడా గెలవలేకపోయాయి.
జయలలిత నేతృత్వంలో అన్నా డీఎంకే ఏకంగా 37 స్థానాల్లో విజయఢంకా మోగించింది. గత అనుభవం నేపథ్యంలో మళ్లీ తన పాత మిత్రపక్షం డీఎంకేతో కాంగ్రెస్ చేతులు కలిపింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్, తమిళనాడు, పుదుచ్చేరిలకు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరిల సమక్షంలో చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’లో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సీట్ల పంపకంపై బుధవారం రాత్రి ప్రకటన చేశారు. కాంగ్రెస్‌కే ఏయే సీట్లు కేటాయించేదీ త్వరలో చెబుతామన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే తమిళనాడులోని పార్లమెంటు స్థానాల్లో గెలవడం కీలకం. అందుకే అత్యధిక స్థానాల్లో గెలుపొందడం ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆశిస్తున్నారు. డీఎంకేతో మళ్లీ కలవడం సంతోషంగా ఉందని వేణుగోపాల్ అన్నారు. ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం పార్టీ లు కూడా ఈ కూటమిలో ఉంటాయి. అన్నాడీఎంకే–బీజేపీ మధ్య సీట్ల పంపకంపై మంగళవారం ప్రకటన రాగా, ఆ మరుసటి రోజే డీఎంకే కూడా కాంగ్రెస్‌కు కేటాయించే సీట్ల సంఖ్యను చెప్పడం గమనార్హం. బీజేపీ 5 స్థానాల్లో పోటీచేస్తోంది.
కమల్ ఒంటరిపోరు
మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, సినీ నటుడు కమల్‌హాసన్ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 24న మొత్తం 40 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. బీజేపీ, అన్నాడీఎంకేలతో మొదటి నుంచి విభేదించిన కమల్‌హాసన్ పార్టీని స్థాపించిన నాటి నుంచి కాంగ్రెస్ దిశగానే అడుగులు వేశారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం సానుకూలంగా వ్యవహరించడంతో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు అళగిరి కమల్‌తో చర్చలు జరిపారు. అయితే డీఎంకేతో కమల్‌కు పొసగకపోవడంతో ఆ కూటమిలో చేరే అవకాశం లేకుండాపోయింది.
Comments
Please login to add a commentAdd a comment