
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుదుట తిలకం దిద్దుతున్న దృశ్యం
ఇల్లెందు: తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిపెండెంట్ ఎంప్లాయిమెంట్‌తో పాటు కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని, డిస్మిస్డ్ కార్మికులను విధుల్లోకి తీసుకుని గని కార్మికులకు అండగా ఉంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం రాత్రి ఇల్లెందు సింగరేణి గ్రౌండ్‌లో నిర్వహించిన ప్రజాచైతన్య బస్సుయాత్ర సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇల్లెందులోని సింగరేణి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని వాగ్దానం చేసిన కేసీఆర్ వాటిని విస్మరించారని విమర్శించారు. డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ స్కీం అమలుకు నోచుకోలేదని, డిస్మిస్డ్ కార్మికులను ఉద్యోగంలోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం జీఓ జారీ చేస్తే.. ఆయన కూతురు కవిత నడుపుతున్న జాగృతి సంస్థ కోర్టుకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 20 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని భరోసా ఇచ్చిన కేసీఆర్ ఆ వర్గాన్ని కూడా నిండా ముంచారని విమర్శించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోగా, గిరిజనుల ఆధీనంలో ఉన్న పోడు భూములను లాక్కుని హరితహారం పేరుతో మొక్కలు నాటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గిరిజనుల పక్షాన పోరాడేందుకు టీపీసీసీ ఆధ్వర్యంలో బలరాంనాయక్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేయకపోగా దళిత వర్గాల పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం దురహంకారం ప్రదర్శిస్తోందని అన్నారు. ఇల్లెందు మున్సిపల్ కమిషనర్ రవిబాబుపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు దాడిచేశారని, ప్రభుత్వం ఆయనకు న్యాయం చేయకపోగా ఇక్కడి నుంచి బదిలీ చేశారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఏవర్గానికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నేరెళ్లలో ఇసుక మాఫియా అక్కడి దళితులను చిత్రహింసలకు గురి చేసిందని, పోలీసులు కూడా వారిపైనే థర్డ్ డిగ్రీ ఉపయోగించి కేసులు బనాయించారని ఆరోపించారు. వారిని పరామర్శించేందుకు వచ్చిన పార్లమెంట్ మాజీ స్పీకర్ మీరాకుమారి పట్ల సైతం సీఎం కేసీఆర్ అనుచితంగా మాట్లాడారని విమర్శించారు. ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలని పలు దఫాలుగా డిమాండ్ చేస్తే నేటికీ ఆ ఊసే లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, డ్వాక్రా సంఘాలకు లక్ష వరకు రివ్వాలింగ్ ఫండ్ అందజేస్తామని హామీ ఇచ్చారు. రూ. 10 లక్షల రుణాల వరకు వడ్డీ మాఫీ చేస్తామన్నారు. అభయహస్తం పథకాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి రూ. 3 వేలు చెల్లిస్తామని, ఇల్లెందులో బస్సుడిపో, రైలు మంజూరు చేస్తామని ప్రకటించారు. విలేకరులదరికీ న్యాయం చేస్తామన్నారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మట్లాడుతూ.. రాష్ట్రంలో దశబ్దాల పాటు కాంగ్రెస్ పాలించిందని, ఏనాడూ ప్రజలను హింసించలేదని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అహంభావంతో ఒకవైపు ప్రజలను మరోవైపు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ కేటాయింపుపై ప్రస్తావించిన ఇద్దరు ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేసీఆర్‌కు ఇదే చివరి బడ్జెట్ సమావేశమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తీరని అన్యాయం జరిగిన ఏకైక జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా అని, కేసీఆర్ చర్యకు ఇది నిదర్శనంగా మిగిలిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. ఏడు మండలాలను ఆం«ధ్ర రాష్ట్రానికి అప్పగించి ఖమ్మం జిల్లాకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని ప్రకటించిన కేసీఆర్‌కు చట్టం, రాజ్యాంగం తెలియదా అని ప్రశ్నించారు. కేసీఆర్ దుశ్చర్యలతో మైనార్టీలు విద్యాపరంగా తీవ్రంగా నష్టపోయారన్నారు. 1.90 లక్షల సీట్ల నుంచి 48 వేల సీట్లకు పడిపోయిందన్నారు. ఇల్లెందులో కాంగ్రెస్ నుంచి గెలిచిన కోరం కనకయ్య హైద్రాబాద్, ఇల్లెందులో బంగ్లాలు సంపాదించారని, విలువైన కార్లను కొనుగోలు చేశారని అన్నారు. అంతకు ముందు సైకిల్ కూడా లేని కనకయ్యకు బంగ్లాలు, విలువైన కార్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
రేణుకాచౌదరి మాట్లాడుతూ బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను మోసగించిన కేసీఆర్‌కు దమ్ముంటే తన ముందుకు రమ్మని, తనచేతికి ఉన్న విష్ణుచక్రాలతో తఢాఖా చూపిస్తానని సవాల్ విసిరారు. ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్‌ను గెలిపించుకునే ఆత్మాభిమానం ఎక్కువగా ఉందని, టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయిన కనకయ్యకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజలను మోసం చేసిన కనకయ్య బతికున్నంత కాలం ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం లేదన్నారు. ఈ సభలో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, నాయకులు దొంతు మాధవరెడ్డి, జగన్‌లాల్, సంభాని చంద్రశేఖర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పోట్ల నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ, సీతక్క, రామ్మోహన్‌రెడ్డి, బెల్లయ్యనాయక్, భరత్‌చంద్రారెడ్డి, రాంరెడ్డి చరణ్‌రెడ్డి, పోరిక సాయిశంకర్ నాయక్, ఇల్లెందు పట్టణ, మండల అధ్యక్షులు ఎస్.కె జానీ, పోశం వెంకటేశ్వర్లు, నియోజకవర్గ నాయకులు చీమల వెంకటేశ్వర్లు, బానోత్ హరిప్రియ, డాక్టర్ రాంచందర్‌నాయక్, భూక్యా దళ్‌సింగ్‌నాయక్, డాక్టర్ జి.రవి, మంగీలాల్‌నాయక్, అజ్మీర శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment