సింగరేణి గనులపై కేంద్రం కత్తి పెడితే రాష్ట్ర ప్రభుత్వం సాన పడుతోంది
రాష్ట్రంలోని బొగ్గుగనులు సింగరేణి కాలరీస్‌కే కేటాయించాలి
లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కంపెనీపై కేంద్ర ప్రభుత్వం కత్తిపెడితే రాష్ట్ర ప్రభుత్వం ఆ కత్తికి సాన పట్టినట్లు వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాఖ్యానించారు. రాష్ట్రంలోని బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం ఇన్నేళ్లపాటు చేసిన కుట్రను బీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోవడంతో కేంద్ర ప్రభుత్వం సింగరేణిపై చేస్తున్న కుట్రలు సాగుతున్నాయని చెప్పారు.
గురువారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే సింగరేణిని ఖతం చేస్తున్నారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 16 ఎంపీ సీట్లు ఇచ్చి ఉంటే వేలాన్ని అడ్డుకునేవాళ్లమన్నారు. వేలం పాట ద్వారా గనులు కేటాయించవద్దని సీఎంగా కేసీఆర్ గతంలోనే కేంద్రానికి లేఖ రాశారని, నాడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి స్పందిస్తూ వేలం లేకుండా కేటాయించాలని కేంద్రాన్ని కోరిన సంగతిని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కోల్ బ్లాక్‌ల వేలానికి మద్దతు తెలుపుతోందని, దీనికి కేసుల భయమా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు.
ప్రైవేటీకరణ చేసేందుకే...
ఒడిశాలో రెండు లిగ్మైట్ గనులను బీజేపీ ప్రభుత్వమే ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిందని, గుజరాత్‌లోనూ రెండు పబ్లిక్ అండర్ టేకింగ్ సంస్థలకు 2015లో ఐదు కోల్ బ్లాక్‌లను కేటాయించిందని, అదేవిధంగా తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అభ్యంతరం తెలిపితే... ఎలాంటి వేలం లేకుండా లిగ్మైట్ గనులను ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించిందని కేటీఆర్ చెప్పారు. కానీ తెలంగాణలో మాత్రం సింగరేణికి ఎందుకు గనులకు కేటాయించటం లేదని ప్రశ్నించారు.
ఈ ప్రక్రియలో సింగరేణిని ప్రైవేటీకరణ చేసే పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందంటూ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం అప్పట్లో చెప్పిందని, కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ గని లేకుండా నష్టపోయేలా కేంద్ర ప్రభుత్వమే చేసిందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకే వేలం కార్యక్రమం ముందుకు పెట్టారని, ఈ వేలంపాటలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పాల్గొంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
నాడు అంధకారంలోకి దక్షిణాది
సింగరేణి కారి్మకుల సత్తా ఏంటో తెలంగాణ ఉద్యమ సమయంలో చూశామని, అప్పుడు వాళ్లు సమ్మె చేస్తే దక్షిణ భారతం మొత్తం అంధకారంలోకి వెళ్లే పరిస్థితి వచి్చందని కేటీఆర్ అన్నారు. అలాంటి సింగరేణిని కచ్చితంగా బీఆర్‌ఎస్ కాపాడుకుంటుందని చెప్పారు. తెలంగాణ నుంచి ఒకరు కేంద్రమంత్రి అయితే రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టు రావాలని, కానీ మన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉన్నదాన్ని అమ్మే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు.
లోక్‌సభలో బీఆర్‌ఎస్ లేకపోవటంతోనే సింగరేణిని ఖతం పట్టించబోతున్నారని వాఖ్యానించారు. నాలుగు బొగ్గు గనులను కేటాయించే అవకాశం ఉన్నప్పుడు కూడా ఎందుకు కేటాయించటం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కేటాయించే ప్రయత్నాలను సాగనివ్వమని, 2028లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడు ఈ వేలం దక్కించుకున్న కంపెనీలను సహించబోమని హెచ్చరించారు. బొగ్గు గనుల వేలంపై రెండు, మూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని కేటీఆర్ వివరించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment