ధిక్కరణపై కోర్టుకు! | Congress delegation to meet Speaker on Monday | Sakshi
Sakshi News home page

ధిక్కరణపై కోర్టుకు!

Published Sat, Jun 9 2018 1:20 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress delegation to meet Speaker on Monday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంక ట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ సభ్యత్వ రద్దు వ్యవహారంలో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సీఎల్పీ నిర్ణయించింది. ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేసేందుకు సిద్ధమవుతోంది.

న్యాయ పోరాటం చేస్తూనే ఈ నెల 11న అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారిని, అనంతరం దశలవారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, రాష్ట్రపతిని సైతం కలవాలని నిర్ణయించింది. శుక్రవారం ఉదయం సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.

ఇందులో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ, సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొనగా డీకే అరుణ, వంశీచంద్‌రెడ్డి హాజరుకాలేదు.  ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి పార్టీ మార్పు, ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ హెచ్చరిక తదితర పరిణామాలపై చర్చించారు.

కోమటిరెడ్డిపై జానా సీరియస్‌  
ప్రభుత్వం తమ పట్ల అనుసరిస్తున్న ధోరణికి నిరసనగా, మూకుమ్మడి రాజీనామాలు చేయాలన్న కోమటిరెడ్డి   డిమాండ్‌పై సీఎల్పీలో ప్రస్తావన వచ్చింది.  బహిరంగ వేదికలపై తనపై ఎలా నిందలు వేస్తారని, ఇలా వ్యవహరించి పార్టీని పలుచన చేయరాదని కోమటిరెడ్డిపై జానా మందలింపు ధోరణితో అన్నట్లు తెలిసింది.

ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి పార్టీ మారడానికి దారి తీసిన పరిస్థితులు, అందుకు ఎవరు బాధ్యత వహించాలన్న అంశంపైనా వాడివేడిగా చర్చ జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంపై చర్చించారు. సమ్మెకు దిగితే ఉద్యోగాలు ఊడుతాయంటూ సీఎం వ్యాఖ్యానించటం దురదృష్ణకరమని, ఈ విషయంలో కార్మికులకు అండగా ఉండాలని నిర్ణయించారు. మూకుమ్మడి రాజీనామాలపై చర్చే జరగలేదని సమావేశం అనంతరం మీడియాతో జానారెడ్డి స్పష్టం చేశారు.

కోర్టులంటే సీఎంకు గౌరవం లేదు: ఉత్తమ్‌
భేటీ అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ కోర్టుల పట్ల ప్రభుత్వానికి, స్పీకర్‌కు కనీస గౌరవంలేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆరోపించారు. కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ఈ నెల 11న జానారెడ్డి నేతృత్వంలో స్పీకర్‌ను కలుస్తామని తెలిపారు. 

కోర్టు తీర్పును గౌరవించని కేసీఆర్‌కు సీఎం పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. త్వరలోనే కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఖమ్మం, అలంపూర్‌లో 24 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టి, తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.  

భట్టి నివాసంలో మరో భేటీ
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై సాయంత్రం టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్‌ నేతలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, ఏఐసీసీ కార్యదర్శులు వి.హనుమంతరావు, చిన్నారెడ్డి, మధుయాష్కీ హాజరయ్యారు. 

పార్టీ జిల్లాల అధ్యక్షులను పాత పది జిల్లాలకే ఉంచాలా లేదా 31 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించాలా అన్న అంశంపై  చర్చ జరిగింది. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందుగానే వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని, పార్టీ ఎజెండాను 8 నెలల ముందే జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.


ఉద్యమంలో పాల్గొన్న కార్మికులనే బెదిరిస్తారా: జీవన్‌రెడ్డి
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమైతే ఉద్యోగాలు పోతాయని సీఎం కేసీఆర్‌ హెచ్చరించడం దురదృష్టకరమని డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ టి.జీవన్‌రెడ్డి అన్నారు. సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆర్టీసీ కార్మికులను బెదిరించడం సరికాదన్నారు.  ప్రభుత్వ రాయితీలు ఇవ్వకుండా డ్రైవర్లు, కండక్టర్లను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement