
సాక్షి, న్యూఢిల్లీ : బలమైన వ్యూహాలు, ప్రభావమంతమైన నిర్వహణా లోపంవంటివి ఈ ఎన్నికల్లో తమ పార్టీలో కనిపించాయని రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. ఈ విషయంలో బీజేపీ ముందుందని చెప్పారు. సోనియాగాంధీకి కీలక సలహాదారుగా వ్యవహరించిన ఆయన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటమి గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఉన్న ఉత్సాహాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందన్నారు.
రాహుల్ తన ప్రచార హోరుతో పార్టీ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపారని, ప్రధాని నరేంద్రమోదీకి కంటే కూడా ఎక్కువ ప్రతిస్పందన ఆయన ప్రచారానికి వచ్చిందని కొనియాడారు. కానీ, క్షేత్ర స్థాయిలో ఆ ఊపును పార్టీ కార్యకర్తలు ఓట్ల రూపంలో మలచలేకపోయారని ఈ విషయాన్ని తాము పరిశీలనలోకి తీసుకుంటున్నామని అన్నారు. 'మరికొంత శ్రద్ద తీసుకొని ఉంటే మేం మరో ఏడు నుంచి ఎనిమిది సీట్లు పొందే వాళ్లం. గుజరాత్ ప్రజలు బీజేపీతో అలసిపోయారని మాకు తెలుసు. వారెవరు కూడా బీజేపీతో సంతోషంగా లేరు. వారు బీజేపీని ఓడించాలనుకున్నారు. మా పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు బలంగానే పనిచేశారు. కానీ, భాగస్వామ్య పార్టీ అభ్యర్థులు మాత్రం సరిగా పనిచేయలేకపోయారు' అని చెప్పారు. ఏదీ ఏమైనా రాహుల్ మాత్రం బాగా కష్టపడ్డారని, ఆయన చేయగలిగిందల్లా చేశారని, ఓట్లు సంపాధించుకునే బాధ్యత మాత్రం పార్టీ కార్యకర్తలు చేయాల్సిన పని అని, రాహుల్ ప్రచారాన్ని వారి వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుందని అన్నారు.