
హుజూర్‌నగర్: ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార టీఆర్‌ఎస్, విపక్ష కాంగ్రెస్ పార్టీల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై దృష్టి.. అధికార పార్టీని ఎండగట్టాల్సిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని.. తానే ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
తమ పార్టీ సిద్ధాంతాలతో కలసివచ్చే పార్టీలు ఉంటే వాటితో పొత్తులు పెట్టుకోవడానికి తాము సిద్ధమన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను పోటీలో నిలుపుతామని గట్టు పేర్కొన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి లక్షా 16 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారని, నేటి వరకు కనీసం 20 వేలు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేపట్టి ఒక్క ఎకరాకూ నీరందించలేక పోతోందన్నారు.
ప్రజా సంకల్ప యాత్రకు బ్రహ్మరథం
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్మార్గపు పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజలు సంసిద్ధులై జగన్‌కు అపూర్వ స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రను ఆదరించిన మాదిరిగానే ప్రజలు ఆయన్ను అక్కున చేర్చుకుంటున్నారని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వేముల శేఖర్‌రెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి కస్తాల ముత్తయ్య, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కర్నె వెంకటేశ్వర్లు, యూత్ రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, కె.రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment