వచ్చే ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా వైఎస్సార్‌సీపీ
- పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
- జిల్లా పార్టీల సమీక్షలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మక శక్తిగా మారనుందని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా పార్టీ విభాగాల సమీక్షను శనివారం ఆయన ప్రారంభించారు. సమావేశాలు ఈ నెల 20 వరకు జరుగుతాయి. తొలి రోజు నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల సమావేశంలో పార్టీ నాయకులకు గట్టు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సమన్వయకర్తలను నియమిస్తామని, పార్టీని రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థాయిల్లోనూ పటిష్టపరుస్తమని పేర్కొన్నారు. జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాలు, మండల కమిటీలు సగంపైగా పూర్తయ్యాయని చెప్పారు. మిగతా కమిటీలను ఆగస్టు 10లోగా పూర్తి చేయాలన్నారు. ‘‘ప్రతి మండలంలోనూ 100 మంది చురుకైన కార్యకర్తలతో కమిటీలు వేయాలి. జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో పర్యటించాలి. ప్రతి సందర్భాన్ని ఒక అవకాశంగా తీసుకుని నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలి. కార్యకర్తలు చేసే మంచి సూచనలను నాయకత్వం స్వీకరిస్తుంది. పార్టీ నాయకులపై వ్యక్తిగత విమర్శలకు దిగితే ఉపేక్షించేది లేదు’ అని గట్టు చెప్పారు.
అదీ వైఎస్ ఘనత : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని శ్రేణులకు గట్టు సూచించారు. వైఎస్ రాజనీతిజ్ఞుడని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, నీటిపారుదల రంగనిపుణుడు ఆర్.విద్యాసాగర్‌రావు మీడియా సాక్షిగా కొనియాడిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్‌ను స్ఫూర్తిగా తీసుకుని ప్రాజెక్టులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆయన రాజనీతిజ్ఞత కారణంగానే ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని విద్యాసాగరరావు పేర్కొనడాన్ని ప్రజలం తా గ్రహించారన్నారు. వైఎస్ విగ్రహాలుం టే ప్రజలకు జలయజ్ఞం గుర్తుకొస్తుందనే భయం కాంగ్రెస్, టీడీపీలకు పట్టుకుందన్నారు.
మూడో విడత రుణమాఫీలో ఒక్కో రైతుకు రూ.25వేలు మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు దాన్ని రూ.6,250కి తీసుకొచ్చిందని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి భాస్కర్‌రావు, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంత్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఇరుగు సునీల్, పిట్టా రామిరెడ్డి, సలీం, ఎం.గవాస్కర్‌రెడ్డి, కె.మల్లయ్య, శేఖర్‌రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.హనుమంతు, పార్టీ అనుబం ధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.