సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన మహానేత వైఎస్సార్ ఫొటో పెట్టుకోవడానికి జంకుతున్న ఆ పార్టీ నేతలు.. సిగ్గు లేకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదుర్చుకోవాలనుకోవడం నీతిమాలిన చర్య అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు బొమ్మ పెట్టుకొని ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఆ పార్టీ నేతలకు అసలు సిగ్గుందా? అని ప్రశ్నించారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ‘నిరుద్యోగ గర్జన’సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు, నీళ్లు, నియామకాలంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఉద్యోగాల జాడలేదన్నారు.
అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పిన లక్ష ఉద్యోగాల భర్తీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. లోపభూయిష్టంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయడం, కోర్టు కేసులతో నియామకాల ప్రక్రియ ఆగిపోవడం పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేతకాని వ్యవస్థలా తయారైందని ఆయన మండిపడ్డారు. నాలుగున్నరేళ్లలో లక్షన్నర ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 12 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని 19 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినా కోర్టు ద్వారా రద్దయ్యాయని తెలిపారు. నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఉద్యోగాలు భర్తీ చేసే వరకు ఉద్యమాన్ని ఆపబోమని హెచ్చరించారు.
ఉద్యోగాలు భర్తీ చేశాకే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ, భగీరథ పథకాలు కమీషన్లు దండుకోవడానికేనని గట్టు ఆరోపించారు. ప్రాజెక్టు పనుల పురోగతి, నిధుల కేటాయింపులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ చేపట్టిన ప్రాజెక్టులకే రీడిజైనింగ్ చేస్తూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్తగా చేపట్టి ప్రాజెక్టులు ఏమీ లేవని ఆయన విమర్శించారు. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల పనులు చేస్తూ గొప్పలు చెప్పుకోవడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రివాజుగా మారిందని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మరోసారి ప్రజలను వంచించడానికే ముందస్తు ఎన్నికల డ్రామాకు తెరలేపారని గట్టు ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ సొంత ఎజెండాతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి బెజ్జంకి అనిల్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవరావు, డాక్టర్ ప్రపుల్లకుమార్‌రెడ్డి, సేవాదళ్ అధ్యక్షుడు వెంకటరమణ, రాష్ట్ర కార్యదర్శి అజయ్‌వర్మ, ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి అక్కెనపల్లి కుమార్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment