తెలంగాణా కాంగ్రెస్ పార్టీ స్వరం మారుతున్నది. గాత్రంలో కొత్త గమకాలు పుట్టుకొస్తున్నాయి. లక్ష్యసిద్ధి కోసం బొంత పురుగునైనా ముద్దాడాలనేది కేసీఆర్ నుడివిన సూక్తి. దాన్ని మరింత ముందుకు తీసుకొనిపోతూ భస్మాసురుడి కౌగిట్లో చేరడానికి సిద్ధపడింది... గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కూటమి కట్టి తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. కనాకష్టంగా 3 శాతం ఓట్లు సంపాదించింది. ఆ మూడు శాతం ముచ్చట కోసం కాంగ్రెస్ పార్టీ తన తెలంగాణ రిమోట్ కంట్రోల్‌ను చంద్రబాబు చేతిలో పెట్టినట్టు కనిపిస్తున్నది.
కాంగ్రెస్ గెలుపు కోసం తెలుగుదేశం పోటీ నుంచి తప్పుకున్నది. ఈ సంగతి స్వయంగా చంద్రబాబే తనకు చెప్పినట్టు అప్పటి తెలంగాణా యూనిట్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టంగా చెప్పారు. పైకి కనిపించే దృశ్యం ఇది. దీపం ముందు శలభంలా కాంగ్రెస్ కోసం తెలుగుదేశం ఒక సారో పాత్రలో కనిపిస్తున్నది. కానీ సారం మాత్రం అది కాదు. పోచమ్మ గుడి ముందు కట్టేసిన బలి పొట్టేలు కాంగ్రెస్ పార్టీయే! లేని విశ్వసనీయతను చంద్రబాబుకు కట్టబెట్టడం కోసం, ఆయనకు తెలంగాణలో ‘హోమ్లీ ఫీలింగ్’ను కలుగజేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం తనను తాను హననం చేసుకోవడానికి కూడా అది వెనుకాడటం లేదు.
తెలంగాణ ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకొని ‘ఇండియా టుడే’ జాతీయ న్యూస్ ఛానల్ వాళ్లు హైదరాబాద్‌లో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇతర పార్టీల నాయకులతోపాటు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన రెండు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. వీటిపై తెలంగాణాలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ‘1995లో చంద్రబాబు ప్రారంభించిన ఐటీ, ఫార్మా, ఔటర్ రింగ్ రోడ్, మెడికల్ హబ్ వంటి కార్యక్రమాలను కాంగ్రెస్ కొనసాగించింద’ని ఆయన చెప్పారు. ఇదొక చర్చనీయాంశం.
భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) పద్ధతులతో రాచకొండ ప్రాంతంలో ఒక కొత్త నగరాన్ని 50 వేల ఎకరాల్లో నిర్మించడం రెండో వివాదాస్పద వ్యాఖ్య. చంద్రబాబు విఫల ప్రయోగం అమరావతిని ఈ సమీకరణ గుర్తుకు తెస్తున్నది. ఏదో యథా లాపంగా రేవంత్ రెడ్డి నోటి వెంట ఈ మాటలు వచ్చి ఉంటా యనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వైపు నుంచి ఆ తర్వాత ఎటువంటి వివరణ రాలేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులెవరూ ఖండించలేదు. ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే రెండు చోట్ల, అందులో ఒకటి ముఖ్యమంత్రి స్థానంలో పోటీ చేసే అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా రేవంత్ వ్యాఖ్యల్లో అభ్యంతరాలు కనిపించలేదు.
ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగానికి పాదు చేసిందెవరు? ఎనభయ్యో దశకం నాటి నుంచే తెలుగునాట సమాచార రంగంలో యెల్లో మీడియా గుత్తాధిపత్యాన్ని సంపాదించింది. అప్పటి నుంచి యెల్లో మీడియాకు తాను వలచింది రంభ, తాను ముని గింది గంగ! తెలుగు ప్రజలందరూ ఇటువంటి అభిప్రాయాలనే కలిగివుండి తీరాలి. వేరే మార్గం లేదు! ఆ దశలో చంద్రబాబు అనే కొయ్యగుర్రాన్ని సృష్టించి పరుగులరాణి పంచకల్యాణిగా లోకానికి పరిచయం చేశారు. ‘ఐటీ రంగ సృష్టికర్త అతనే’ అని డప్పు వేయించారు.
ఈ డప్పుల మోత ఎంత ఉన్మాద స్థాయికి చేరిందంటే – చివరికి చంద్రబాబే అవన్నీ నమ్మి, తనను తాను ఐన్‌స్టీన్‌కు అన్నయ్యగా, న్యూటన్‌కు పాఠం చెప్పిన గురువుగా భ్రమపడేంతగా! రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ సెల్‌ఫోన్, కంప్యూటర్ వగైరా వగైరాలను తానే కనిపెట్టాననే అపస్మారక మాటల నుంచి ఆయన బయటపడలేక పోవడానికి యెల్లో మీడియా డప్పుల మోతే కారణం.
వాస్తవానికి హైదరాబాద్‌లో ఐటీ రంగానికి ఆద్యులెవరు? భవిష్యత్తులో ఐటీ రంగం పోషించబోయే పాత్రను అర్థం చేసు కున్న దార్శనికుడు... నాటి ప్రధాని పీవీ నరసింహారావు. ‘సాఫ్ట్‌వేర్ పార్క్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఐదారు నగరాల్లో ఐటీ పార్కులను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. సహజంగానే ఆయనకు హైదరాబాద్‌పై ఉండే మక్కువతో మొదటి పార్క్‌ను హైదరాబాద్‌కు కేటాయించారు.
ఇప్పుడు ‘సైబర్ టవర్స్’గా మనం పిలుచుకుంటున్న భవంతికి 1993లోనే నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి (కాంగ్రెస్) శంకు స్థాపన చేశారు. దాన్ని మరుగుపరిచి, ఆ ప్రాంతంలో తనకు కావలసిన వారు, బినామీలు భూములు కొనుగోలు చేసేంత వరకు మూడు నాలుగేళ్ల పాటు చంద్రబాబు జాగు చేశారు. ఈ ఆలస్యం కారణంగా ఐటీలో తొలిస్థానంలో ఉండవలసిన హైదరాబాద్‌ను బెంగళూరు అధిగమించింది. ఆ రకంగా హైద రాబాద్ ఐటీ రంగానికి చంద్రబాబు చేసింది ద్రోహం!
వడ్డించేవాడు మనవాడైతే కడ పంక్తిన కూర్చున్నా ఢోకా లేదంటారు. వర్తమాన చరిత్రను రికార్డు చేసే వార్తాపత్రికలకు చంద్రబాబు కావల్సినవాడ య్యారు. కనుక ఐటీని కనిపెట్టినవాడనే భుజకీర్తులను ఆయనకు తగిలించారు. ‘కామమ్మ మొగుడంటే కామోసు’ అనుకున్నట్టు ఆయన నిజంగానే తాను ఐటీ ఫౌండర్‌నని నమ్మడం మొదలు పెట్టారు.
కానీ కాంగ్రెస్ పార్టీ వారైనా వాస్తవాలను వెలుగులోకి తెచ్చి ఆ క్రెడిట్‌ను తీసుకోవాలి కదా? విచిత్రంగా కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అయిన బీఆర్‌ఎస్ వాళ్లే దీన్ని గుర్తించి క్రెడిట్‌ను కాంగ్రెస్‌కు ఇస్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్లు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ గజమాల చంద్రబాబు మెడలోనే ఉండాలని తెగ ఉబలాటపడుతున్నారు. దాని కొనసాగింపే నిన్నటి ‘ఇండియా టుడే’ సమావేశంలో రేవంత్ చెప్పిన మాటలు.
చంద్రబాబు ప్రారంభించిన ఐటీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డును కూడా తాము కొనసాగించామని రేవంత్ చెప్పారు. సైబర్ టవర్స్‌కు కాంగ్రెస్ వాళ్లు శంకుస్థాపన చేస్తే, ఆలస్యం చేసైనా చంద్రబాబు నిర్మించి ప్రారంభించాడు. ఐటీ ప్రారం భంలో చంద్రబాబు పాత్ర కూడా ఉన్నదని చెబితే ఎంతో కొంత అతుకుతుంది. ఔటర్ రింగురోడ్డును బాబు తలకు ఎట్లా చుట్టేస్తారు? 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
దానిప్రకారం మియాపూర్ నుంచి శంషాబాద్ వరకు 150 అడుగుల వెడల్పుతో రోడ్డును నిర్మించాలి. మియాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు అప్పటికే రోడ్డు ఉన్నది. దాన్ని కొంచెం వెడల్పు చేస్తే సరిపోతుంది. అక్కడ నుంచి శంషాబాద్ వరకు 150 అడుగుల వెడల్పుతో 27 కి.మీ. రోడ్డును కొత్తగా వేయాలి. ఇది ప్రకటన మాత్రమే! కాగితం కదిలిందీ లేదు. సర్వే జరిగిందీ లేదు. ఈ నోటిఫికేషన్ కూడా హైదరాబాద్ పడమటి ప్రాంతాన్ని మాత్రమే కవర్ చేస్తుంది.
నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలనే ప్రతిపాదన వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు జీవం పోసుకున్నది. 500 అడుగుల వెడల్పుతో, 175 కి.మీ. పొడవునా నిర్మించాలని సంకల్పించి, సర్వేలను ముగించి, శరవేగంగా భూసేకరణను కూడా పూర్తి చేసింది ఆయన హయాంలోనే! ఈ భూసేకరణ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వంతో రామోజీరావు కయ్యానికి దిగి, ‘పెద్దలా? గద్దలా..?’ పేరుతో విషప్రచారాన్ని ప్రారంభించారు.
ఆయన భూముల్లో కొద్ది భాగం రోడ్డు కోసం సేకరించవలసి వచ్చింది. దాన్ని మినహాయించాలంటే రోడ్డు వంకర తిరగాలి. సాంకేతికంగా ఇది సాధ్యమయ్యే పని కాదు గనుక ఆయన సలహాను వైఎస్సార్ ప్రభుత్వం మన్నించలేకపోయింది. దాంతో ప్రభు త్వంపై ఆయన యుద్ధాన్ని ప్రకటించారు. భూసేకరణ దశలోనే జరిగిన ఈ రభస ఇప్పటికే చాలామందికి గుర్తే!
భూసేకరణ పూర్తి చేయడమే గాక రోడ్డు నిర్మించడంలో కూడా 90 శాతాన్ని రాజశేఖరరెడ్డి పూర్తి చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం మిగతా భాగాన్ని పూర్తి చేసి సుందరీకరణ, విద్యుదీ కరణ వంటి పనులను చేపట్టింది. వాస్తవాలు ఇలా వుంటే ఔటర్ రింగ్ రోడ్డులో ఎటువంటి పాత్ర లేని చంద్రబాబు ఖాతాలో దాన్ని వేయడం యెల్లో మీడియాకు, తెలుగుదేశం వీరాభి మానులకు మాత్రమే సాధ్యమయ్యే సాహసం. ఈ సాహస పోటీలో వాళ్లను తలదన్నేలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహ రిస్తున్నది. తాము మాత్రమే సొంతం చేసుకోవాల్సిన ప్రతిష్ఠలో అర్ధ భాగాన్ని చంద్రబాబుకు సమర్పించేందుకు వారు సిద్ధపడుతున్నారు.
మహాభారతంలో ద్రోణాచార్యుడు, పాంచాల రాజైన ద్రుపదుడు బాల్యస్నేహితులు. కష్టాల్లో ఉన్న ద్రోణుడు ఒకసారి సాయం కోసం ద్రుపదుడి దగ్గరకు వెళ్లాడట. ద్రుపదుడు అవమానించి పంపాడు. ఆ కోపాన్ని చానాళ్లపాటు ద్రోణుడు కడుపులో దాచుకున్నాడు. కురు, పాండవ రాకుమారులకు విద్య నేర్పిన తర్వాత కడుపులోని అక్కసును వాళ్ల ముందు ద్రోణా చార్యుడు వెళ్లగక్కాడు.
వెంటనే అర్జునుడు బయల్దేరి ద్రుపదుణ్ణి బంధించి తెచ్చి గురువు ముందు నిలబెడతాడు. ఆ విధంగా గురుదక్షిణ చెల్లిస్తాడు. చంద్రబాబు తాను వేసుకున్న విజనరీ ముసుగుకు అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్‌లో ఘోర అవమానం జరిగింది. ఆ ప్రాజెక్టు ఆచరణ సాధ్యమయ్యేది కాదన్న అభిప్రాయం రోజురోజుకూ బలపడుతున్నది. తనను నమ్మి పెట్టుబడులు పెట్టిన కస్టమర్ల నుంచి ఒత్తిడి ఎదుర వుతున్నది. ఈ దశలో ప్రాజెక్టు ఆచరణ సాధ్యమేనన్న ఊరట దొరకాల్సిన అవసరం బాబుకు ఏర్పడి ఉండవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ ద్వారా ఓ గ్రీన్ ఫీల్డ్ సిటీ ఏర్పాటును ప్రకటిస్తే చంద్రబాబుకు బోలెడంత ఊరట. తన విజన్‌ను పక్క రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కేవలం ప్రకటన చాలు. ఆ తర్వాత కొంచెం ప్రచారం చాలు.
అంతకు మించి అది ముందుకు కదిలే అవకాశాలు లేవు. ఈ ప్రకటనతో లాభపడే మొదటి వ్యక్తి రామోజీరావు. ఔటర్ రింగ్ రోడ్డుకూ, రాచకొండ గుట్టలకూ మధ్యన ఫిలిం సిటీ ఉంటుంది. పక్కనే రాచకొండ నగరం ప్రచారంతో తన ఫిలిం సిటీ భూముల విలువ పెరుగుతోంది. ఒకప్పుడు లక్ష నాగళ్లతో ఫిలిం సిటీని దున్నేయాలన్న నినాదాల బదులు లక్షల కోట్ల విలువైన ల్యాండ్ బ్యాంక్‌గా అది మారుతోంది. ఆ భూముల చట్టబద్ధత, వివా దాలు వగైరా వేరే అంశం.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సారథికి పూర్వాశ్రమంలో చంద్ర బాబు గురువు. చంద్రబాబుకు రామోజీ గురువు. రాచకొండ నగర ప్రకటన ఈ గురుపరంపర కోరిన దక్షిణ కావచ్చు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్ఠానానికీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలకూ ఎందుకు పట్టడం లేదు? ఎవరి అవసరాలు వారివి! గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు భారీగా ఆర్థిక సాయాన్నందించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అంతకు ముందు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల్లోనూ ఖర్చు బాధ్యతను ఆయన తీసుకున్నందువల్లనే పొత్తు కుదిరిందన్న విషయం కూడా విదితమే. ఇప్పుడు కూడా ఆ బాధ్యతను కర్ణాటక కాంగ్రెస్‌తో పాటు బాబు వర్గం కూడా తీసుకున్నట్టు సమాచారం.
ఇటీవల కొందరు సినీ ప్రముఖులు, వ్యాపారులు, ఇతర రంగాల వారూ సుమారు 150 మంది హైదరాబాద్‌లోని ఓ క్లబ్‌లో సమావేశమై రాజకీయ చర్చలు జరిపినట్టు సమాచారం వచ్చింది. వీరిలో కొందరు అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్‌లో భూములు కొనుగోలు చేసినవారున్నారు. ఇంకొందరు తెలుగు దేశం పార్టీతో వ్యాపార, సామాజిక సంబంధాలున్నవారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలనీ, అందుకు అవసరమైన ‘సహకారాన్ని’ అందించాలనీ కూడా వారు తీర్మా నించినట్టు తెలిసింది.
ఇందుకు ప్రతిఫలంగా వారు ఆశించేది కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని కొంచెం పైకి లేపే జాకీ కావాలి. అమరావతి వెంచర్‌లో చిన్నపాటి కదలికైనా రావాలి. కర్ణుడి చావుకు ఆరు కారణాలన్నట్టు రాచకొండ ప్రక టనకు కూడా ఇటువంటి అనేక కారణాలుండవచ్చు. నగర రియల్ ఎస్టేట్ అవసరాలకు అత్యంత చేరువలో ట్రిపుల్ వన్ జీవో పరిధిలో లక్ష ఎకరాలు సిద్ధమవుతున్న సమయంలో డిమాండ్‌ను మించిన సప్లై అందుబాటులోకి వచ్చింది.
రాచకొండ సిటీ ఆచరణాత్మకమవుతుందని ఎవరూ భావించడం లేదు. భావించాల్సిన అవసరం కూడా లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపా రులకు కావలసింది అరచేతిలో వైకుంఠం చూపడమే! అమ రావతిలో బాబు చూపిన వైకుంఠం వికటించింది. ఇప్పుడు కాంగ్రెస్ ‘హస్తం’లో దాన్ని కొత్తగా చూపించాలి. మెడికల్ బెయిల్ మీద హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు తక్షణ మిషన్ ఇదే! క్యాటరాక్ట్ ఆపరేషన్ కోసం నాలుగు వారాల సమయం కావాలని బాబు న్యాయవాదులు గట్టిగా వాదించి 28వ తేదీ దాకా మెడికల్ బెయిల్ తెచ్చుకున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచార ఘట్టం ఆ రోజున పూర్తవుతుంది.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
పల్లవి... కాంగ్రెస్, చరణం... చంద్రబాబు!
Published Sun, Nov 12 2023 4:14 AM | Last Updated on Sun, Nov 12 2023 9:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment