సోమవారం అసెంబ్లీ, మండలి సంయుక్త సమావేశంలో గవర్నర్‌పైకి హెడ్‌సెట్‌ను విసురుతున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాల తొలి రోజునే అసెంబ్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సభ్యులు చేసిన ఆందోళన అదుపు తప్పింది. ఏకంగా ప్లకార్డులు, కాగితాలు, హెడ్‌సెట్‌లతో కాంగ్రెస్ సభ్యులు దాడికి దిగటంతో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభం కావాల్సిన సభ అయిదు నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. జాతీయ గీతాలాపన అనంతరం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ప్రారంభించారు.
ప్రసంగం మొదలైన మూడు నిమిషాలకే కాంగ్రెస్ సభ్యులు తమ సీట్లలోంచి లేచి.. ప్లకార్డులతో నిరసన తెలిపారు. ‘రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి.. దళిత వ్యతిరేక ప్రభుత్వం నశించాలి.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి..’అని పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభ్యుల అరుపులు, కేకలతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. మరోవైపు గవర్నర్ ప్రసంగానికి మద్దతు పలికేందుకు టీఆర్‌ఎస్ సభ్యులు బల్లలు చరుస్తూ శబ్దాలు చేశారు. దీంతో పోటీ వాతావరణం నెలకొంది.
నినాదాలు చేస్తూ కాంగ్రెస్ సభ్యులు ఒక్కసారిగా వెల్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన మార్షల్స్ కాంగ్రెస్ సభ్యులను వెల్ వైపు రాకుండా అడ్డుకున్నారు. దీంతో మార్షల్స్ కాంగ్రెస్ సభ్యుల మధ్య తోపులాట కొనసాగింది. అదే సమయంలో కొందరు సభ్యులు గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి వెల్‌లోకి విసిరేశారు. ఘర్షణ వాతావరణం కొనసాగడంతో మార్షల్స్ నాలుగు వలయాలుగా ఏర్పడి కాంగ్రెస్ సభ్యులను ప్రతిఘటించారు.
గవర్నర్ ప్రసంగం కొనసాగినంత సేపు కాంగ్రెస్ సభ్యులు జీవన్‌రెడ్డి, సంపత్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి, సంతోష్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి వెల్‌లోకి చొచ్చుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు. చించిన కాగితాలు పోడియంపైకి మరింత బలంగా విసిరేందుకు పోటీ పడ్డారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి .. తమ సీట్లకు అమర్చిన హెడ్‌ఫోన్స్‌ను విరిచేసి గవర్నర్ వైపు గురి చేసి విసిరారు. తన సీటుపై నిలబడి దాడి చేశారు.
ఈ క్రమంలో కోమటిరెడ్డి తనంతట తానే అదుపు తప్పి టేబుల్‌పై పడ్డారు. రెండోసారి విసిరిన హెడ్‌ఫోన్స్ ఏకంగా గవర్నర్ ప్రసంగిస్తున్న వేదికపైకి దూసుకెళ్లింది. వెనుక ఉన్న గోడకు తగిలి గవర్నర్ పక్క సీటులో ఉన్న శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు తగిలింది. దీంతో ఆయన కంటికి స్వల్ప గాయమైంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీ సిబ్బంది ఆయన్ను హుటాహుటిన సరోజినీదేవి కంటి ఆస్పత్రికి తరలించారు.
ముందుగానే అప్రమత్తమైన ప్రభుత్వం
కాంగ్రెస్ సభ్యుల దాడిని ముందుగానే ఊహించిన ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుగానే అప్రమత్తమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోడియం పక్కనే భారీ సంఖ్యలో మార్షల్స్‌ను మోహరించింది. కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీలోకి అడుగు పెట్టగానే ఎమ్మెల్యే డీకే అరుణ.. ఇదేమన్నా పోలీసు రాజ్యమా.. అసెంబ్లీనా.. ఇంతమంది పోలీసులెందుకు అని ప్రశ్నించారు. మార్షల్‌కు, సభ్యులకు మధ్య తోపులాట జరిగిన సందర్భంలో ముందు వరుసలో ఉన్న సీట్లు చెల్లాచెదురయ్యాయి.
అదే సీటులో ఉన్న సీఎల్పీ నేత జానారెడ్డి కూర్చోలేక గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్నప్పుడే బయటకు వెళ్లిపోయారు. ఆయన వెంటే పొంగులేటి సుధాకర్‌రెడ్డి పలువురు సభ్యులు బయటకు వెళ్లారు. మొత్తంగా సభ 20 నిమిషాలపాటే సాగడం గమనార్హం.
బీజేపీ వాకౌట్
ఓవైపు కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేస్తుంటే మరోవైపు బీజేపీ.. సభ నుంచి వాకౌట్ చేసింది. ఒక్క రాజాసింగ్ తప్ప మిగిలిన బీజేపీ సభ్యులు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అబద్ధాలను భరించలేకపోతున్నామని, గవర్నర్‌తో నాలుగేళ్లుగా ప్రభుత్వం ఇదే ప్రసంగాన్ని చెప్పిస్తోందని, అందుకే వాకౌట్ చేశామని ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు.
రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగ సమస్యలు గవర్నర్ ప్రసంగంలో లేవని నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం గవర్నర్ ద్వారా అబద్ధాలు చెప్పిస్తోందని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ధ్వజమెత్తారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని, ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి ఇవ్వలేదంటూ మండిపడ్డారు. బీసీ సబ్‌ప్లాన్‌ను అమలు చేయడంలో విఫలమైందని, గవర్నర్ అబద్ధాల ప్రసంగాన్ని వినలేకే సభ నుంచి వాకౌట్ చేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment