రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ (పాత చిత్రం)
తిరువనంతపురం : రాజ్యసభ డిప్యూటి చైర్మన్ పీజే కురియన్ రాజకీయాల నుంచి సెలవు తీసుకోవాని కేరళ యువ కాంగ్రెస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల(జూన్)లో కేరళకు చెందిన మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో కురియన్ రీ నామినేషన్ అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ‘రాజ్యసభ సభ్యునిగా మూడుసార్లు ఎన్నికైన పీజే కురియన్ ఈసారి తెలివైన నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నాను. పార్లమెంటరీ రాజకీయాల నుంచి వారు వైదొలుగుతారని భావిస్తున్నాను’ అంటూ కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీటీ బలరాం తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.
బలరాం అభిప్రాయంతో ఏకీభవించిన మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కురియన్ రీ నామినేషన్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘ఎగువ సభ(రాజ్యసభ)ను ఒక వృద్ధాశ్రమంగా మార్చాలని పార్టీ అనుకోవడం లేదు. కురియన్ వంటి సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మంచిది. యువకుల కోసం కాంగ్రెస్ పార్టీ ద్వారాలు ఎల్లప్పుడూ తెరచుకుని ఉంటాయని రాహుల్ చెప్పారంటూ’ యువ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన పీజే కురియన్.. ‘అధిష్టానం కోరుకున్నట్లయితే వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నానం’టూ వ్యాఖ్యానించారు. అయితే డిప్యూటీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం రాజ్యసభలో తగినంత బలం లేదు.
చెంగనూర్ ఓటమికి కారణం ఎవరు..?
మే 31న వెలువడిన చెంగనూర్ ఉప ఎన్నిక ఓటమి నేపథ్యంలో కేరళ కాంగ్రెస్ చీఫ్‌ను మార్చాలనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ చికిత్స నిమిత్తం విదేశాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరిగి రాగానే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత కేరళ కాంగ్రెస్ చీఫ్ ఎంఎం హసన్‌తో పాటు సీనియర్ నేతలు వీడీ సతీషన్, మాజీ ఎంపీ కె. సుధాకరన్, మాజీ మంత్రి ముల్లపల్లి రామచంద్రన్ కేరళ కాంగ్రెస్ చీఫ్ పదవి రేసులో ముందున్నారు.
Comments
Please login to add a commentAdd a comment