
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారిని ఆవేదనకు గురిచేస్తోంది
సాక్షి, హైదరాబాద్ : ఏ రాష్ట్రం కోసమైతే ఉస్మానియా విద్యార్థులు జైలుకెళ్లి మరీ పోరాడారో నేడు అదే రాష్ట్రంలో వారిని ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు కలవాలంటే ప్రభుత్వం అనుమతించడం లేదంటూ ప్రతిపక్ష నేత జానారెడ్డి మండిపడ్డారు. శనివారం జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ మాత్రం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారిని ఆవేదనకు గురిచేస్తోందని విమర్శించారు.
తెలంగాణ ప్రజల దుస్థితిని చూసి రాహుల్ గాంధీ బాధపడుతున్నారని అన్నారు. వారి బాధలు తెలుసుకోవడం కోసమే ఆయన రాష్ట్రంలో పర్యటిస్తున్నారని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ వివిధ వర్గాల వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటరని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉస్మానియా విద్యార్థులు అనేక సార్లు జైలుకు వెళ్లి, ఉద్యమాలలో పాల్గొని పోరాడారు. నేడు ఆ విద్యార్థులను కలవాలని రాహుల్ అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అందువల్లే రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన రద్దు చేసుకున్నారని వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటిది నేడు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదో ప్రజలు గమనించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. అందుకే విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాహుల్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశానికి జానారెడ్డితో పాటు, వంశీచంద్ రెడ్డి, గీతారెడ్డి, పొంగులేటి, దొంతి మాధవరెడ్డి, ఆకుల లలిత, భట్టి విక్రమార్క తదితర నాయకులు హాజరయ్యారు.