
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగి‘రేసు’గుర్రాలకు కష్టకాలమొచ్చింది. టీడీపీ, వామపక్షాలు, టీజేఎస్‌తో పొత్తు ఆ పార్టీ ఆశావహులపై నీళ్లుజల్లుతోంది. మహాకూటమితో జట్టు కట్టడం వల్ల నాలుగు సీట్లకు కోత పడునుంది. 2014 ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన స్థానాలపై టీడీపీ కన్నేయడంతో ఆ సెగ్మెంట్లను కాంగ్రెస్ పార్టీ వదులుకోవాల్సిన పరిస్థితి అనివార్యమవుతోంది. గత ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన ఏడు నియోజకవర్గాలను వదిలేయాలని తెలుగుదేశం పార్టీ కోరుతున్నా.. మూడు స్థానాలను త్యజించేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. బలమైన టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు, ఉమ్మడి ప్రత్యర్థి అయిన కేసీఆర్‌ను గద్దె దింపేందుకు టీడీపీ అండ తప్పనిసరని కాంగ్రెస్ భావించి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది. శివారు నియోజకవర్గాల్లో ఆ పార్టీ కేడర్ ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం.. సీమాంధ్ర ఓటర్లు బీజేపీని వ్యతిరేకిస్తున్నందున టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారని అంచనా కాంగ్రెస్ వేస్తోంది. ఈ సమీకరణలన్నింటినీ అంచనా వేసిన కాంగ్రెస్..ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తపడుతోంది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ వ్యతిరేకశక్తులను కూడగట్టింది. టీడీపీ సహా సీపీఐ, టీజేఎస్‌ను కూడా కూటమిలో చేర్చుకుంది.
సీట్ల సర్దుబాటుపైనే చర్చ
మహాకూటమి ఆవిర్భవించడంతో సీట్ల సర్దుబాటుపై ఆయా పక్షాలు చర్చలు జరిపాయి. రాష్ట్రస్థాయిలో సీట్ల సంఖ్య సర్దుబాటుపై స్పష్టత వచ్చినా.. ఏయే స్థానాలను ఇచ్చిపుచ్చుకోవాలనే అంశంపై చర్చ సాగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో గత ఎన్నికల్లో కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్‌బీనగర్, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాలను టీడీపీ వశం చేసుకుంది. అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎల్‌బీనగర్ శాసనసభ్యుడు కృష్ణయ్య మినహా మిగతా వారంతా గులాబీ గూటికి చేరారు. శివారు సెగ్మెంట్లలో పార్టీ బలంగా ఉండటం.. సిట్టింగ్ స్థానాలు కావడంతో తమకే ఇవ్వాలని టీడీపీ ప్రతిపాదించింది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఉప్పల్, మహేశ్వరం, ఎల్‌బీనగర్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలను పొత్తులో భాగంగా తమకు కేటాయించాలని సూచించింది.
ఈ ప్రతిపాదలనపై చర్చించిన కాంగ్రెస్ నాయకత్వం ఉప్పల్, కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానాలను టీడీపీకి కేటాయించేందుకు అంగీకరించింది. 2014నాటి పొత్తులో ఉప్పల్ బీజేపీకి వదిలేయడం.. కాంగ్రెస్ అభ్యర్థిగా భావించిన బండారి లక్ష్మారెడ్డి కూడా ఇటీవల గులాబీ కండువా కప్పుకున్న నేపథ్యంలో టీడీపీకి అప్పగించేందుకు ముందుకొచ్చింది. కూకట్‌పల్లిలో బలమైన అభ్యర్థి లేకపోవడం.. ఇక్కడ సీమాం ధ్ర ఓటర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నందున దీన్ని వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. శేరిలింగంపల్లిపై ఇరుపార్టీల మధ్య సమ్మతి కుదరట్లేదు. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే త్యాగం చేయాలని భావిస్తోంది. ఎల్‌బీనగర్ సీటుపైనా టీడీపీ గట్టిగా పట్టుబడుతోంది. జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి కోసం ఈ స్థానాన్ని అడగాలని నిర్ణయించింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున సుధీర్‌రెడ్డి బరి లో దిగనున్నందున ఇరుపార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. కుత్బుల్లాపూర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, వికారాబాద్ సీట్లు కోరు తున్నా వాటిపై పట్టువిడుపులు ప్రదర్శించనుంది.
టీజేఎస్ ఖాతాలో మల్కాజిగిరి
తెలంగాణ జనసమితి (టీజేఎస్)కి మల్కాజిగిరి స్థానాన్ని కేటాయించేందుకు కాంగ్రెస్–టీడీపీలు దాదాపు అంగీకారం తెలిపాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ పోటీచేసింది. ఈసారి ఆ పార్టీతో పొత్తు లేనందున టీజేఎస్‌కు వదిలేసేందు కు టీడీపీ, కాంగ్రెస్ ముందుకొచ్చాయి. ఈ స్థానం నుంచి టీజేఎస్ తరఫున కపిలవాయి దిలీప్‌కుమార్ పోటీ చేయనున్నా రు. ఆయన సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఉండటంతో కపిలవాయి అభ్యర్థిత్వానికి టీజేఎస్ మొగ్గుచూపుతోంది. టీజేఎస్ అభ్యర్థిగా బరిలో దిగాలని భావిస్తున్న మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి మనవడు ఆదిత్యరెడ్డి కూడా ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.