సాక్షి, హైదరాబాద్: మహాకూటమి భాగస్వామ్యపక్షాల మధ్య చర్చలు మరోమారు అసంపూర్తిగా ముగిశాయి. శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కూటమి నేతలు విడివిడిగా, కలివిడిగా సమావేశమైనా ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏయే స్థానాలు కేటాయించాలన్న అంశంపై స్పష్టత రానట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీతో పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ సీపీఐ, తెలంగాణ జనసమితిల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన మాత్రం తొలగలేదు. సీట్ల సంఖ్యతోపాటు స్థానాల విషయంలో సీపీఐతో పడిన పీటముడి వీడకపోగా 8 స్థానాల విషయంలో కాంగ్రెస్‌తో ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ ఏయే స్థానాలు కేటాయించాలన్న విషయమై టీజేఎస్‌తో కూడా అవగాహన రాలేదని తెలుస్తోంది.
తొలుత విడివిడిగా...
తొలుత ఓ హోటల్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి. కుంతియా సమావేశమై మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన స్థానాల గురించి చర్చించారు. అదే సమయంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మరో హోటల్‌లో టీజేఎస్ అధినేత కోదండరాంతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాట్లపై ముగ్గురు నేతలు చర్చించిన అనంతరం కోదండరాం కాంగ్రెస్ నేతల వద్దకు వెళ్లారు. టీడీపీ, సీపీఐ అభిప్రాయాలతోపాటు జనసమితికి ఇవ్వాల్సిన సీట్ల గురించి ఉత్తమ్, కుంతియాలతో చర్చించారు. అరగంటకుపైగా సమావేశం అనంతరం బయటకు వచ్చిన కోదండరాం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.
కాంగ్రెస్ నేతలు చెప్పిన విషయాలను తమ పార్టీ నేతలతో చర్చించేందుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత చాడ, రమణలు ఉత్తమ్, కుంతియాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 3 సీట్లకు బదులుగా సీపీఐకి 4 కేటాయించాలనే అంశంపై నేతల మధ్య చర్చ జరిగిందని సమాచారం. బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్‌లతోపాటు కొత్తగూడెం స్థానాన్ని కూడా ఇవ్వాలని చాడ కోరినట్లు తెలిసింది. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు కూడా స్పష్టత ఇవ్వనట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన చాడ కూటమి నుంచి బయటకు వెళ్లాలన్న ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్‌తో చర్చల్లో ఏమీ తేలలేదని, ఆదివారం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు.
ఇంటి పార్టీతోనూ ఉత్తమ్, కుంతియా చర్చలు
టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేతలతో సమావేశానికి ముందు ఉత్తమ్, కుంతియాలు తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌తో సమావేశమయ్యారు. ఇంటి పార్టీకి ఒక స్థానం ఇస్తున్నామన్న కుంతియా ప్రకటన నేపథ్యంలో ఎక్కడి నుంచి పోటీకి అవకాశముందన్న అంశంపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం చెరుకు సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ తాము నకిరేకల్ కాకుండా నల్లగొండ జిల్లాలో ఒక సీటు ఇవ్వాలని, మహబూబ్‌నగర్, షాద్‌నగర్ స్థానాలను కూడా కోరుతున్నామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తనతోపాటు తన భార్య పడిన కష్టం కోమటిరెడ్డి సోదరులకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో తాము కోమటిరెడ్డి సోదరులకు అండగా నిలిచామని, కానీ వారు ఇప్పుడు తమకు వ్యతిరేకంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఉత్తమ్, జానాలను ఓడిస్తామని కోమటిరెడ్డి సోదరులు ప్రకటించడం సరికాదని, వారితో ఒరిగేదేమీ లేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment