
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి వస్తోంది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే విషయమై క్రమంగా లెక్క తేలుతోంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను 92–95 చోట్ల కాంగ్రెస్, 12–14 స్థానాల్లో టీడీపీ, 6–8 స్థానాల్లో టీజేఎస్, నాలుగు చోట్ల సీపీఐ పోటీ చేయాలని ఆయా పార్టీల నేతలు ప్రాథమికంగా ఓ అవగాహనకు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కూటమి సీట్ల సర్దుబాటు కోసం కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల మధ్య ఎడతెరపి లేకుండా చర్చలు జరుగుతున్నాయి. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ సోమవారం కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ నేతలతో సమావేశమయ్యారు.
తేలని టీజేఎస్ లెక్క...
వాస్తవానికి కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై టీడీపీ, సీపీఐలతో కాంగ్రెస్‌కు పెద్దగా సమస్యలు రావడం లేదు. మూడు పార్టీల మధ్య కొంత భేదాభిప్రాయాలున్నా సర్దుకుపోయే కోణంలోనే మొదటి నుంచీ చర్చలు జరుగుతున్నాయి. అయితే కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్‌కు ఎన్ని స్థానాలు కేటాయించాలన్న దానిపైనే కొంత సందిగ్ధత నెలకొంది. టీజేఎస్ పోటీ చేయాలనుకుంటున్న స్థానాల సంఖ్యతోపాటు ఏయే స్థానాల నుంచి పోటీ చేయాలన్న విషయంలోనూ కూటమిలో ఏకాభిప్రాయం రావడం లేదని తెలుస్తోంది.
అయితే ఈ సందిగ్ధతకు కూడా తెరదింపుతామని, నేడో, రేపో సీట్ల సర్దుబాటు పూర్తిస్థాయిలో కొలిక్కి వస్తుందని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. ప్రస్తుతానికి సీట్ల ప్రతిపాదనల్లో 92–95 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించాలనేది ఆలోచనగా ఉందని, ఇందులో కూడా చివరకు మార్పులు జరిగే అవకాశం ఉందని ఆ నేత పేర్కొన్నారు. మొత్తంమీద టీఆర్‌ఎస్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా తమ సర్దుబాటు ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment