సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్ధాపించిన టీడీపీ ప్రస్తుతం కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు అర్రులు చాస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులుచెరిగారు. విపక్షాలు తమ వ్యక్తిగత, రాజకీయ మనుగడ కోసమే రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం మహాకూటమిగా ఏర్పడుతున్నాయని ధ్వజమెత్తారు. మహాకూటమిని రాజవంశీకుల కూటమిగా ప్రధాని అభివర్ణించారు.ఈ పార్టీలు అధికారం కోసం అపవిత్ర కలయికకు పూనుకున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం తమిళనాడుకు చెందిన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మహాకూటమిలో కొన్ని పార్టీలు తమకు సోషలిస్ట్ నేత రామ్ మనోహర్ లోహియా ఆదర్శమని చెప్పుకుంటున్నాయని, అయితే తాను కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని స్వయంగా రామ్ మనోహర్ లోహియా వెల్లడించారన్నారు. మహాకూటమి ప్రతిపాదన కేవలం వ్యక్తుల మనుగడ కోసమేనని, సిద్ధాంత ప్రాతిపదిక ఏర్పాటయ్యేది కాదని మోదీ ఆరోపించారు.
ఈ కూటమి ప్రజల కోసం కాదని అధికారం కోసమని, ప్రజా ఆకాంక్షల కోసం కాకుండా వ్యక్తిగత ఆకాంక్షల కోసమే వీరంతా ఒక్కటవుతున్నారని విమర్శించారు. మహాకూటమిలో పలు పార్టీల నేతలు గతంలో ఎమర్జెన్సీ సమయంలో నిర్బంధంలో ఉన్నారని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష పార్టీలు మహాకూటమితో ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment