సాక్షి, అమరావతి: ‘‘అధికారం కోసం ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు జగమెరిగిన సత్యం. అయితే ఎన్టీఆర్ జీవిత కాలం పాటు పోరాడిన కాంగ్రెస్ పార్టీతో కలవడం ద్వారా ఆయనకు రెండో సారి వెన్నుపోటు పొడిచారు.’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. ఎన్టీఆర్ ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ కోసం అలుపెరగని పోరాటం చేస్తే.. ఆయన అల్లుడు (చంద్రబాబు) మాత్రం తన అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పాదాల ముందు తన శిరస్సు ఉంచారని విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి నిజమైన ప్రతీక ఎన్టీ రామారావు అని, అయితే ఆయన ఆశయాలకు తిలోదకాలిచ్చిన వ్యక్తి తెలుగు ప్రజల ఆత్మగౌరవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ప్రధాని ఎద్దేవా చేశారు. అలాగే చంద్రబాబు తన కొడుకు జీవితంలో వెలుగులు నింపడం కోసం.. ఏపీని అంధకారంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు.
తన కుటుంబానికి ప్రయోజనం కలిగితే తెలుగువారి ఆత్మగౌరవం నిలబడినట్టు, తన కుటుంబ ప్రయోజనాలకు విఘాతం కలిగే పరిస్థితులు ఉత్పన్నమైతే మాత్రం తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం కలుగుతున్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవమంటే ఆ ఒక్క కుటుంబ ప్రయోజనాలేనా అని దుయ్యబట్టారు. ఆదివారం ప్రధాని మోదీ రాష్ట్రంలోని అనంతపురం, కడప, కర్నూలు, నరసరావుపేట, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ బూత్ కమిటీ కార్యకర్తలతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అనంతపురం నుంచి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధరన్, నరసరావుపేట నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కర్నూలు నుంచి పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ‘ఆత్మగౌరవం’ డ్రామా
‘‘రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఓ కుటుంబం చేసే ప్రయత్నాలన్నీ తెలుగువారి ఆత్మగౌరవం కోసం చేస్తున్నట్లు ఎలా అవుతాయి? రా>ష్ట్ర ప్రజలందరిని నిర్లక్ష్యం చేసి తమ అధికారాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేయడమంటే.. అది తెలుగు వారి ఆత్మగౌరవమా? వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకొని ప్రతి రోజూ అసత్యాలతో, అసభ్య పదజాలంతో మోదీని తిడితే అది తెలుగువారి ఆత్మగౌరవం అవుతుందా? ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయి ప్రధాని కావాలని కలలు కనడం తెలుగువారి ఆత్మగౌరవం కిందకే వస్తుందా?’’ అని మోదీ విమర్శలు గుప్పించారు. తన కుమారుడికి బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు శ్రద్ధ చూపుతున్న చంద్రబాబు.. రాష్ట్రంలో మిగిలిన వారి కుమారులు, కూతుర్ల ప్రయోజనాలను పరిరక్షించడం మరిచిపోయారని ఎద్దేవా చేశారు.
బాబులో కనిపించే ఆ అసహనమే ఓటమికి సంకేతం
కాకినాడలో మహిళా కార్పొరేటర్‌ను ‘ఫినిష్’ చేస్తానంటూ సీఎం వ్యాఖ్యానించడం, ఇటీవల కాలంలో పలుచోట్ల బీజేపీ నాయకులపై టీడీపీ నేతల దాడుల గురించి కన్నా లక్ష్మీనారాయణ ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ‘‘ఒక వ్యక్తి సహనం ఎప్పుడు కోల్పోతారో మీరే చెప్పండి. రాజకీయ ప్రత్యర్థులపై అసహనంతో బెదిరింపులకు దిగి మాట్లాడుతున్నారంటే.. ఆ నాయకుడికి ఓటమి భయం పట్టుకుందని తేటతెల్లమవుతుంది. అధికారం ఉండీ, అంత యంత్రాంగం ఉన్న వ్యక్తి అలా మాట్లాడారంటే .. అది బీజేపీ కార్యకర్తలు సాధించిన విజయంగా పరిగణించాలి. ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతున్నట్టు, అందుకు అభినందిస్తున్నా’’ అని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీని తక్కువగా అంచనా వేయొద్దని.. త్రిపుర రాష్ట్రంలో సున్నా స్థాయి నుంచి అధికారం కైవసం చేసుకోవడాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇదే పునరావృతమవుతుందని, రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకున్నట్లు చెప్పారు.
వెనుకబడిన జిల్లాలకు నిధులిస్తే యూసీలు ఇవ్వలేదు
అనంతపురం, వైఎస్సార్ కడప వంటి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం నిధులిచ్చినా, వాటి ఖర్చుకు సంబంధించిన యూసీలు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయలేదని మోదీ ఆరోపించారు. వైఎస్సార్ జిల్లాలో వివిధ గనుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఆ జిల్లా అభివృద్దికి ఖర్చు పెట్టాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను జిల్లా అభివృద్ధికి ఖర్చు చేయడం లేదన్నారు. ‘కేంద్రం నుంచి డబ్బులు నేరుగా జిల్లాలకే వస్తున్నాయి. కాని ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియడం లేదు. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి అధిక నిధులు ఇచ్చాం. వేరేగా ఖర్చు పెట్టినవాటికి బిల్లులు పంపితే వాటికి కూడా నిధులు చెల్లిస్తున్నాం’’ అని మోదీ చెప్పారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అలాగే మీడియా యజమానులు ఎక్కువ మంది వ్యాపార రంగం వారు కావడం వల్ల ఇప్పుడు దేశమంతటా మీడియాపై ఫిర్యాదులు వినిపిస్తున్నాయన్నారు. తానూ 2001లో పార్టీ నాయకునిగా మీడియా పక్షపాతాన్ని ఎదుర్కొన్నానని మోదీ చెప్పారు. కార్యకర్తలే ప్రజల వద్దకు నేరుగా వెళ్లి బీజేపీ విధానాలను వివరించాలని సూచించారు.
ఎన్టీఆర్‌కు రెండోసారి చంద్రబాబు వెన్నుపోటు!
Published Mon, Jan 7 2019 4:46 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment