సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను దసరా తర్వాతే ప్రకటించనున్నారు. మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, టీజేఎస్, సీపీఐ మధ్య సీట్ల సర్దుబాట్లు కొలిక్కి వచ్చాకే తొలి జాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. సర్దుబాటుకు ముందే ఈ నిర్ణయం తీసుకుంటే కూటమిలో నిరసన వ్యక్తమయ్యే అవకాశం లేకపోలేదనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
తొలుత.. ఈ నెల 15, 16 తేదీల్లో 40 మందితో తొలి జాబితా విడుదల చేయాలని కాంగ్రెస్ భావించింది. ఈలోగా కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియను ముగించాలని కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ నాయకత్వానికి సూచించింది. కానీ చర్చలపై ప్రతిష్టంభన తొలగకపోవడమే ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. కూటమి తరఫున ఉమ్మడి ప్రణాళికను విడుదల చేయడం, కూటమికి భాగస్వామ్యపక్షాల్లో ఒకరిని చైర్మన్‌గా నియమించడం వంటివి వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
టీడీపీకి 12, జనసమితికి 5
కాగా, కూటమి నిర్మాణంలో భాగంగా టీడీపీ 12 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ నియోజకవర్గాలతో కూడిన జాబితాను కాం గ్రెస్‌కు ఇచ్చింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఉప్పల్, రాజేంద్రనగర్‌తో పాటు మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర, మక్తల్, నల్లగొండ జిల్లా కోదాడ, కరీంనగర్ జిల్లా కోరుట్ల ఉన్నట్లు తెలిసింది. మరో ఎనిమిది నియోజకవర్గాల పేర్లు ఇచ్చి వాటిలో 4 కచ్చితంగా ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఆ ఎనిమిది నియోజకవర్గాల పేర్లు వెల్లడి కావాల్సి ఉంది.
టీజేఎస్‌కు 5 స్థానాలు కేటాయించేందుకు అంగీకరించిన కాంగ్రెస్ ఆయా నియోజకవర్గాలు, పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు కూడా ఇవ్వాలని కోరింది. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే క్రమంలో.. సమర్థులైన అభ్యర్థులు లేకపోతే ఇబ్బందులు వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ఈ ఎన్నికల్లో పోటీచేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ కోరుతోంది. దానికి ఆయన సమ్మతించినట్లు తెలుస్తోంది. ఇకపోతే సీపీఐకి 2 స్థానాలు మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. కరీంనగర్ జిల్లాలో ఒకటి, ఖమ్మం జిల్లాలో ఒకటి ఇవ్వనున్నట్లు సీపీఐకి సమాచారమిచ్చింది.
40 చోట్ల అభ్యర్థుల ఖరారు
కాంగ్రెస్ అధిష్టానం దూతలు, పార్టీ స్క్రీనింగ్ కమిటీ కూర్చుని కసరత్తు చేసిన తర్వాత.. ఇప్పటివరకు 40 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. ఈ నియోజకవర్గాలకు ఒక్కో పేరునే పార్టీ స్క్రీనింగ్ కమిటీ కూడా ఆమోదించింది. ఈ జాబితానే పండగ తర్వాత విడుదల చేసే అవకాశం ఉందని.. పార్టీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. 100 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే.. మరో 35 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
ఈ ప్రాంతాల్లో ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. వీటిలో మెజారిటీ స్థానాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. నల్లగొండలో 4, మహబూబ్‌నగర్‌లో 2 స్థానాల్లోనూ టిక్కెట్ల కోసం పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని స్క్రీనింగ్ కమిటీ భావిస్తోంది. అయితే, ఇప్పటికే ఖరారు చేసిన 40 నియోజకవర్గాల్లో చాలా వరకూ ఏఐసీసీ మార్గదర్శకాలకు విరుద్దంగా ఉన్నట్లు పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు.
గత ఎన్నికల్లో 30 వేలు అంతకంటే ఎక్కువ తేడాతో ఓడిపోయిన దాదాపు 10 మంది అభ్యర్థుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అటు, కాంగ్రెస్ బరిలో ఉండాలనుకుంటున్న మరో 25 నియోజకవర్గాలకు కొత్తవారిని ఎంపిక చేయనున్నారు. ఈ 25 నియోజకవర్గాల్లో సీనియర్లు కాకుండా జూనియర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment