సాక్షి, మేడ్చల్ : తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పార్మ్‌హౌస్‌లో పడుకునే ముఖ్యమంత్రి అని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి విమర్శించారు. శుక్రవారం మేడ్చల్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ తన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు అపాయింట్‌మెంట్ ఇవ్వరని, ప్రజలకైతే అస్సలు ఇవ్వరని అన్నారు. అటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించటం అవసరమా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఇంటికి పంపించటానికి హస్తం గుర్తుకే ఓటు వెయ్యవలసిన అవసరం ఉందన్నారు. కేసీఆర్‌ను ఇంటికి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను పార్మ్ హౌస్‌లో పడుకోబెట్టే శక్తి ప్రతాప్‌కు ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సభలో పలువురు కాంగ్రెస్ నేతలు ప్రసంగించారు.
కేసీఆర్ కుటుంబం కాళ్లు ఎందుకు అడ్డం పెట్టలేదు
కేసీఆర్ ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ మాట్లాడారని, గోదావరికి కాలు అడ్డం పెడితే నీళ్లు వస్తాయన్నాడని కాంగ్రెస్ పార్టీ నేత ఒంటేరు ప్రతాప్ పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబంలో పదిమందికి కాళ్లు ఉన్నా గోదావరి, కృష్ణా నదులకు ఎందుకు కాళ్లు అడ్డం పెట్టలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సస్యశ్యామలం చేయలేదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
రాబందుల సమితిగా టీఆర్‌ఎస్
పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి.. రాబందుల సమితిగా మారిందని కాంగ్రెస్ నేత మధు యాష్కీ విమర్శించారు. శుక్రవారం మేడ్చల్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాబందుల నుంచి విముక్తి పొందేందుకు సోనియమ్మని మరోసారి ఆహ్వనించామన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన ఎమ్‌ఐఎమ్‌తో టీఆర్‌ఎస్ జట్టుకట్టిందని పేర్కొన్నారు. సెక్రటేరియట్‌కు రాకుండా ఫార్మ్‌హౌస్‌లో కూర్చోని గద్దలా తెలంగాణను దోచ్చుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కాళ్లకింద తెలంగాణ నగిలిపోయిందన్నారు.
కేసీఆర్ ఓ నియంత.. అహంకారి
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నియంత.. అహంకారి అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ను ఫార్మ్‌హౌస్‌కు పంపాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ లక్షకోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆయన ఆరోపించారు. డబ్బులతో గెలవాలని చూస్తున్న కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో ఏనాడైనా పంటలకు గిట్టుబాటు ధర వచ్చిందా అని ప్రశ్నించారు.
కేసీఆరే ఓటమిని ఒప్పుకున్నారు
ఫాంహౌస్‌కు వెళ్తానని కేసీఆరే ఓటమిని ఒప్పుకున్నారని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పరిమితం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. హామీలు అమలు చేయలేక ముందస్తు ఎన్నికలకు వెళ్లారని, సమస్యలను పరిష్కరించకుండా మాటలకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు.
‘తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మకు వందనం. తెలంగాణను దీవించేందుకు వచ్చిన సోనియమ్మకు, రాహుల్ గాంధీకి స్వాగతం’ అని గద్దర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment