
సాక్షి, విశాఖపట్నం : కరోనా వైరస్‌ను ఎదుర్కునేందుకు దేశమంతా సంఘటితంగా పోరాడుతుంటే.. టీడీపీ నేతలు మాత్రం ఇలాంటి క్లిష్ట సమయాల్లో కూడా రాజకీయ విమర్శలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పేద ప్రజలను ఆదుకునేందుకు రూ.1000 సాయం చేస్తే.. దానిపై కూడా సిగ్గు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడూ.. లాక్‌డౌన్ నేపథ్యంలో పేద ప్రజలను ఆదుకునేందుకు ఇప్పటికే రేషన్, కందిపప్పు అందించామన్నారు. సీఎం జగన్ ఆదేశాలతో పేద ప్రజలకు రూ.1000 ఆర్థిక సాయం అందించామని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టామన్నారు. అన్ని రంగాలవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షాలు నీచ రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. పేదలకు రూ.1000 ఆర్థిక సాయం చేస్తే.. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రకటించడానికి ముందే పేదలకు రూ.1000 సాయం చేస్తానని సీఎం జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. సీఎం జగన్‌కు, తమ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యమని చెప్పారు. బాధ్యత కలిగిన రాజకీయ నేతలుగా తాము ప్రజలకు అండగా ఉంటామని మంత్రి బొత్స పేర్కొన్నారు.