
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న ప్రజా సంకల్ప యాత్రలో విధ్వంసం సృష్టించడానికి చంద్రబాబు నాయుడు సర్కార్ కుట్ర పన్నిందని ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ కుట్రలను ప్రజలతో పాటు పోలీసులు తిప్పికొట్టాలని ఆమె అన్నారు. గురువారం ఎమ్మెల్యే రోజా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ వైఎస్ జగన్ పాదయాత్ర టీడీపీ ప్రభుత్వానికి అంతిమ యాత్ర. పాదయాత్రకు భయపడే చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. ఆయన నరనరాన కుట్రలు, కుతంత్రాలే ఉన్నాయి.
ఓటుకు కోట్లు కేసుతో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం వద్ద సాగిలపడ్డారు. తుని విధ్వంసం టీడీపీ పనేనని నివేదిక వచ్చింది. కాంగ్రెస్‌తో చేతులు కలిపి రాష్ట్రాన్ని నాశనం చేసింది నిజం కాదా?. చంద్రబాబు కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారు. పాదయాత్రలో చంద్రబాబు చేస్తున్న మోసపూరిత విధానాలు, కుట్రలను వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రజలకు వివరిస్తారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసే హక్కు జగన్‌కు ఉంది. 50ఏళ్లకే ఉద్యోగులను ఇంటికి పంపే బాబు కుట్రను వైఎస్‌ఆర్ సీపీ భగ్నం చేసింది. అప్పట్లో అలాంటిదేమీలేదన్న చంద్రబాబు ...ఇప్పుడు ఇద్దరు ఉద్యోగులను ఎందుకు సస్పెండ్ చేశారు?. తప్పులు చేయడం కేంద్రం కాళ్లు పట్టుకోవడం చంద్రబాబు నైజం. వైఎస్ జగన్ ప్రజా సంకల్పాన్ని ప్రజలు విజయవంతం చేస్తారు. ప్రజా సంకల్పంతో టీడీపీకి కౌంట్‌డౌన్ మొదలైంది.’ అని రోజా హెచ్చరించారు.
వైఎస్ జగన్ పాదయాత్ర టీడీపీ ప్రభుత్వానికి అంతిమ యాత్ర