
సాక్షి, అనంతపురం: ఏపీలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో ఓ మహిళను టీడీపీ నేతలు వివస్త్రను చేసి కొట్టారని గుర్తుచేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా ధనియాని చెరువు వద్ద వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడారు.
కాల్‌మనీ, ఎమ్మార్వో వనజాక్షిపై దాడి, రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని, మహిళలపై దాడులు జరిగేవి కావని అన్నారు. చంద్రబాబు మహిళా వ్యతిరేకి అని రోజా ధ్వజమెత్తారు. డ్వాక్రా రుణాల రద్దు చేస్తామని మహిళలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ గతంలో చంద్రబాబు మహిళలను అవమానించారని గుర్తుచేశారు. మహిళలను పారిశ్రామికవేత్తలను చేస్తానని.. భార్య, కోడలిని పారిశ్రామికవేత్తలను చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలన అంతం కోసం మహిళలు పంతం పట్టాలని రోజా అన్నారు. జగనన్న వస్తేనే మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment