సాక్షి, హైదరాబాద్ : సీపీఎం ఏకపక్ష నిర్ణయం తీసుకొని.. సీపీఐని కలిసి రాలేదంటోందని, సీపీఎం వామపక్ష ఐక్యతను దెబ్బతీసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికలు దేశ రాజకీయాలపైన ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో కొత్తదనం లేదని, ప్రజా గొంతుక నొక్కి వేయబడిందని దుయ్యబట్టారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్య విలువలు పాతరేయబడ్డాయని మండిపడ్డారు. 610జీఓలో అనేక అవకతవకలు జరిగాయి కాబట్టే తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని తెలంగాణ ప్రజలు భావించారని పేర్కొన్నారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీ చేపట్టకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. పదవులు కేసీఆర్ కుటుంబానికి మాత్రమేనా.. నిరుపేద బిడ్డలకు అక్కర్లేదా అని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులను పక్కన పెట్టి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ తిరుగుతున్నారని, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులపై ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కొనే ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు పథకాన్ని రాబందు పథకంగా అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయూపై నిర్లక్ష్యం తగదని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment