గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో రేవంత్, తమ్మినేని, కోదండరాం, చాడ వెంకట్‌రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యలపై ఉద్యమించాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈ భూముల సాగుకు హక్కు పత్రాలు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గాను ఆదిలాబాద్ నుంచి అశ్వారావుపేట వరకు 400 కిలోమీటర్ల మేర కనెక్టింగ్ కారిడార్ అంతటా వచ్చే నెల 5వ తేదీన రాస్తోరోకో నిర్వహించాలని తీర్మానించాయి. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఏడు ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి.
మధుయాష్కీగౌడ్, మల్లురవి, కోదండరెడ్డి, అన్వేష్‌రెడ్డి (కాంగ్రెస్), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), చాడా వెంకటరెడ్డి, బాలమల్లేశ్ (సీపీఐ), ప్రొఫెసర్ ఎం.కోదండరాం, పీఎల్ విశ్వేశ్వర్‌రావు (టీజేఎస్), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటిపార్టీ) పోటు రంగారావు, గోవర్ధన్, నరసింహారావు, కె. రమ (సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ), రాజేశ్ (సీపీఐఎంఎల్ లిబరేషన్), ప్రదీప్ (పీవైఎల్), రాము (పీడీఎస్‌యూ)లు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్ర స్థాయిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలు, ధరల పెరుగుదల, పోడు భూములు, వ్యవసాయ, రైతాంగ సమస్యలపై చర్చించారు. అనంతరం ఉద్యమ కార్యాచరణను విలేకరులకు వెల్లడించారు.
ప్రభుత్వాల మెడలు వంచుతాం: రేవంత్‌రెడ్డి
కేసీఆర్, మోదీల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటాలు చేయడం ద్వారా ఈ ప్రభుత్వాల మెడలు వంచి ప్రజలకు న్యాయం చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్య చాలా కీలకమైందని, దాదాపు 20 నియోజక వర్గాల్లోని గిరిజనులు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై దీర్ఘకాలిక పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారమయ్యేంత వరకు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేస్తామని చెప్పారు.
ధరణి పోర్టల్‌లో దాదాపు 25 లక్షల ఎకరాల రైతుల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో సామాన్య, పేద రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 22న ఇందిరాపార్కు వద్ద ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతులు, బాధితులను సమీకరించి మహాధర్నా చేస్తామని తెలిపారు. అదే విధంగా ఈనెల 27న జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన ‘భారత్ బంద్’కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. ఈనెల 30న రాష్ట్రంలోని రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.
కేసీఆర్‌కు భయం పట్టుకుంది: తమ్మినేని
పోడు భూముల సమస్యలపై ప్రతిపక్ష పార్టీల పోరాటం అని ప్రకటించగానే సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని తమ్మినేని వీరభద్రం అన్నారు. అందువల్లే వెంటనే పోడు భూముల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారని ఎద్దేవా చేశారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాల పోరాట కార్యక్రమాల్లో తమ పార్టీకి చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. మహాధర్నా, రాస్తారోకో తదితర కార్యక్రమాలన్నిటినీ విజయవంతం చేయాలని కోదండరాం ప్రజలను కోరారు. పోటు రంగారావు తదితరులు మాట్లాడారు.
టార్గెట్ కేటీఆర్
సీఎం కేసీఆర్ లక్ష్యంగా గజ్వేల్‌లో దండోరా సభ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ, తాజాగా ఆయన కుమారుడు కేటీఆర్ నియోజకవర్గంపై దృష్టి పెట్టింది. అక్టోబర్ 2వ తేదీన సిరిసిల్లలో నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఇలావుండగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రతిపక్ష పార్టీలు గాంధీభవన్‌కు వచ్చి కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో సమావేశం కావడం ఇదే తొలిసారని, ఇది రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణకు దోహదపడుతుందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
ప్రతిపక్ష పార్టీల డిమాండ్లివే..
►దేశంలోని వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగంలోకి తేవాలి. విదేశాల నుంచి వ్యాక్సిన్ దిగుమతి చేసుకోవాలి.
►కోవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలి.
►ఆదాయ పన్ను పరిధిలోని లేని ప్రతి కుటుంబానికి నెలకు రూ.7,500 నగదు అందించాలి. తలకు ఒక్కింటికి 10 కిలోల బియ్యం ఇవ్వాలి.
►పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం విధించిన ఎక్సైజ్ డ్యూటీలు, సర్ చార్జీలను వెంటనే ఉపసంహరించాలి.
►రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి.
►ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలి. మూసివేసిన పరిశ్రమలను తెరిపించాలి.
►కార్మిక కోడ్‌ను రద్దు చేయాలి. సమ్మె, వేతనాల కోసం బేరసారాల హక్కులను పునరుద్ధరించాలి.
►ఉపాధి హామీ చట్టంలో ఏడాదికి 200 పనిదినాలు కల్పించాలి.
►‘పెగాసస్’వ్యవహారంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయవిచారణ జరిపించాలి.
►దేశద్రోహం, జాతీయ భద్రతా చట్టం లాంటి దుర్మార్గపు చట్టాలను ఉపసంహరించాలి.
►అటవీహక్కులు, పీసా చట్టాల అమలు జరపా లి. పోడు భూములకు సాగుహక్కు పత్రాలివ్వాలి.
Comments
Please login to add a commentAdd a comment