
నల్లగొండ: సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి తమ్మినేని వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో గత నాలుగు రోజుల పాటు జరిగిన సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలు ముగిశాయి. మహాసభల చివరి రోజైన బుధవారం రాష్ట్ర కార్యవర్గ నూతన కమిటీని ఎన్నుకున్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తెలంగాణలో బలోపేతం చేసే దిశగా నాలుగు రోజుల పాటు జరిగిన మహాసభల్లో ప్రధానంగా చర్చించారు.
ఈ సభలకు జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి, ప్రకాష్ కారత్, బీవీ రాఘవులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీఎల్‌ఎఫ్ నేతృత్వంలో సీపీఎం పంథా ఏవిధంగా వ్యవహరించాలనే దానిపైన నాలుగు రోజుల సమావేశాల్లో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 13 మంది సభ్యులతో రాష్ట్ర కార్యదర్శి వర్గం, 60 మంది సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
మిగిలిన 12 మంది కార్యదర్శివర్గ సభ్యుల్లో ఎస్. వీరయ్య, చెరుపల్లి సీతారాములు, జి.నాగయ్య, చుక్క రాములు, నంద్యాల నర్సింహారెడ్డి, సున్నం రాజయ్య, బి.వెంకట్, టి.జ్యోతి, జూలకంటి రంగారెడ్డి, పి.సుదర్శన్‌రావు, జి.రాములు, డి.జి. నర్సింహారావు. రాష్ట్ర కేంద్ర సభ్యులుగా 30 మంది, రాష్ట్ర సెంటర్ కొత్త సభ్యులుగా ఏడుగురు, వివిధ జిల్లాల నుంచి 23 మంది సభ్యులతో కలిపి మొత్తం 60 మందితో కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. వీరితో పాటు ఆహ్వానితులు 9 మంది, ప్రత్యేక ఆహ్వానితులు ముగ్గురిని నియమించారు.
ఆహ్వానితులు: కాసాని ఐలయ్య (భద్రాద్రి కొత్తగూడెం), ఆర్. సుధాభాస్కర్ (రాష్ట్ర కేంద్రం), పి.సోమయ్య (రాష్ట్ర కేంద్రం), నాగటి రాములు (రాష్ట్ర కేంద్రం), ఎండి జబ్బార్ (వనపర్తి), ఎ.మల్లేష్ (మెదక్), జి. ముకుందరెడ్డి (కరీంనగర్), జి. జగదీష్ (రాష్ట్ర కేంద్రం), టి. స్కైలాబ్ (రాష్ట్ర కేంద్రం), ప్రత్యేక ఆహ్వానితులుగా మల్లు స్వరాజ్యం, సారంపల్లి మల్లారెడ్డి, పి.రాజారావు.
పొద్దుపోయే వరకు సాగిన ఎన్నిక..
రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఎన్నిక రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. 60 మంది సభ్యులను ఎన్నుకునే క్రమంలో మరో సభ్యుడు పోటీకి దిగడంతో అనివార్యంగా ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. దీంతో దాదాపు రెండుగంటలకు పైగా కార్యవర్గ సభ్యుల ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తడంతో రాష్ట్ర కమిటీని రాత్రి 9 గంటలకు ప్రకటించారు.