సాక్షి, అమరావతి: అధికార టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌ను నిర్వహించే హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా చోరీ స్కామ్‌తో ఏపీలో ఆ పార్టీకి సేవలు అందిస్తున్న పలు ఐటీ సంస్థల్లో కలవరం మొదలైంది. ఆయా సంస్థల్లో ఉన్న ఇబ్బందికర డేటాను క్లియర్ చేయాలని (తొలగించాలని) అధికార పార్టీ నేతల నుంచి నిన్న సాయంత్రం మౌఖిక ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఐటీ మంత్రి నారా లోకేశ్ అనుచరులుగా చెప్పుకొనే కొందరు రంగంలోకి దిగి తమ పార్టీకి అనుకూలంగా ఉండే ఐటీ సంస్థను అప్రమత్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
డేటా చోరీ స్కామ్‌కు సంబంధించి ఎవరైనా వచ్చి ప్రశ్నించినా వివరాలు చెప్పొద్దని, మీ కార్యాలయంలోని కంప్యూటర్స్ (సిస్టమ్స్)లో హార్డ్ డిస్క్‌లను క్లియర్ చేసి, రోజువారీ పనులు చేసుకుంటున్నట్టు కూల్‌గా ఉండాలని కీలక నేతలు దిశానిర్ధేశం చేసినట్టు చెబుతున్నారు. వాస్తవానికి ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్ మాదిరిగానే ఏపీలో దాదాపు 13 సంస్థలు పనిచేస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన శాఖలు, వాటి వివరాలు, పనితీరు, సేవలు, అబ్ధిదారుల సమాచారం.. ఇలా అనేక పేర్లతో అనేక ఐటీ సంస్థలను సర్వీసు ప్రొవైడర్లుగా ఏర్పాటు చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం కోట్లాది రూపాయాల ప్రజాధనం ఫలహారంగా పంచుతూ వచ్చింది. ప్రభుత్వం సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని పార్టీ కోసం పనిచేసే ఐటీ సంస్థలకు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది.
రాష్ట్రంలో కొన్ని ఐటీ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటిలో కొన్ని సంస్థలను సొంత పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నట్టు ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ వ్యవహారంతో తేటతెల్లమైంది. ప్రోనిక్స్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈపీ సాఫ్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కొడ్ ట్రీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎల్ డేటా సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, పీవీఆర్ టెక్నాలజీస్, శ్రేయ కంప్యూటర్స్, ఇన్వెంట్జీ ఎంటర్ ప్రైజెస్ ప్రైౖవేట్ లిమిటెడ్, ప్రొస్పెక్టా టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అల్కోర్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీజ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేఘన జీయోమెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, వాసర్ ల్యాబ్స్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు ప్రభుత్వంలోని పలు శాఖలకు సేవలందిస్తున్నాయి. వాటికి ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని ప్రభుత్వం అందజేసింది. వాటిలో కొన్ని సంస్థలు టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తూ హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్‌కు డేటాను అందజేసినట్టు సమాచారం.
పార్టీ సేవలో ఎంపీ మురళీమోహన్ కోడలి సంస్థ
టీడీపీ ఎంపీ మాగంటి మురళీమోహన్ కోడలికి చెందిన టెలీబ్లూ ఐటీ సంస్థ ప్రభుత్వంతో పలు అంశాలపై ఒప్పందాలు చేసుకుని పార్టీకి సేవలు చేస్తోందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. రాజధాని ప్రాంతంలోని కుంచనపల్లిలో ఉన్న ఈ కార్యాలయంలో దాదాపు 400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన ఆర్టీజీఎస్ నుంచి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఈ సంస్థకు అప్పగించినట్టు తెలిసింది. ఫోన్‌కాల్స్, ఎస్‌ఎంఎస్(మెస్సేజ్)లు పంపించి పలు అంశాలపై ప్రజలను ఆరా తీసే ఈ సంస్థ రాజకీయ కోణంలో మంత్రి లోకేశ్ కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తోందని చెబుతున్నారు.
ఇటీవల ఈ సంస్థ నుంచి ఒక ఉద్యోగి అభిప్రాయ సేకరణ పేరుతో ప్రకాశం జిల్లా పెదదోర్నాల గ్రామంలో టీడీపీ కార్యకర్తకు ఫోన్ చేసాడు. మా గ్రామంలో వైఎస్సార్‌సీపీకి చెందిన వారికి అంగన్‌వాడీ కార్యకర్త పోస్టు ఇచ్చారంటూ టీడీపీ కార్యకర్త బదులిచ్చాడు. మీరు చెప్పిన సమాచారం లోకేశ్ కార్యాలయానికి చెబుతామని, వారు చర్యలు తీసుకుంటారని టెలీబ్లూ సంస్థ ఉద్యోగి పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment