సాక్షి, అమరావతి: ఈ ఫొటోలో వృత్తంలో ఉన్న వ్యక్తిని చూశారా.. ఆయనే దాకవరం అశోక్. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సేవా మిత్ర యాప్ ద్వారా జరిగిన డేటా స్కాంకు సూత్రధారిగా ఉన్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఈయన. ఆధార్, రాష్ట్ర ప్రభుత్వ రహస్య డేటా అక్రమంగా కలిగి ఉన్నారన్న ఆరోపణలతో పోలీసు విచారణ ఎదుర్కొంటున్న ఈయన ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపరంగా జరిగే అధికారిక సమీక్ష సమావేశాల్లో మంత్రి నారా లోకేష్‌తోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు జవహర్‌రెడ్డి, రామాంజనేయులు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్యనే దర్జాగా కూర్చొని ఉన్నారు. ఒక రాజకీయ పార్టీ అయిన టీడీపీకి ఐటీ సేవలు అందించే కంపెనీ యజమాని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక సమీక్ష సమావేశాల్లో పాల్గొనడానికి అనుమతి లభించడం, మంత్రి, సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య దర్జాగా కూర్చోవడాన్ని బట్టి చూస్తే.. మంత్రితో ఆయనకున్న సాన్నిహిత్యం ఏమిటో బోధపడుతుంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌తో ఉన్న సాన్నిహిత్యం, ఆయన అండతోనే ప్రభుత్వ అధికార సమీక్ష సమావేశాల్లో అశోక్ పాల్గొంటున్నారని అధికారులు సైతం చెబుతుండడం గమనార్హం. (‘ఐటీ గ్రిడ్స్’పై సిట్)
లోకేష్ వెంటే ఉంటూ ఎప్పుడూ ఆయన అధికారిక సమావేశాల్లో పాల్గొంటారని వారు చెబుతున్నారు. సచివాలయంలోని ఐదవ బ్లాక్‌లో మంత్రి లోకేష్ చాంబర్‌లోనే అశోక్ ఎప్పుడూ ఉంటారని.. మంత్రి కార్యాలయంలో ఆయనదే పూర్తి హవా అని అంటున్నారు. టీడీపీకి ఐటీ సేవలందించే అశోక్‌కు చెందిన సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి మంత్రి లోకేష్ శాఖల ద్వారానే కోట్ల రూపాయలు చెల్లింపులు సైతం జరిగాయి. గత ఎనిమిది నెలల్లో నాలుగు విడతల్లో ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.01 కోట్లు చెల్లించింది. దీన్నిబట్టి పార్టీకోసం పనిచేసేవారిని ప్రభుత్వ విధుల్లో భాగస్వాముల్ని చేయడమేగాక ప్రభుత్వం నుంచి ఐటీ కాంట్రాక్టులను సైతం కట్టబెట్టారనేది స్పష్టమవుతోంది. మొత్తంగా ఈ తతంగంలో ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన భారీ కుట్ర దాగి ఉందని అధికార వర్గాల్లోనే చర్చ జరుగుతుండడం గమనార్హం.
ఇది చదవండి : టీడీపీ మైండ్‌గేమ్!
Comments
Please login to add a commentAdd a comment