జాతకాలు తవ్వుతున్నారు! | Examining documents in the Case Of IT Grids | Sakshi
Sakshi News home page

జాతకాలు తవ్వుతున్నారు!

Published Tue, Mar 12 2019 3:06 AM | Last Updated on Tue, Mar 12 2019 3:06 AM

Examining documents in the Case Of IT Grids  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ గ్రిడ్స్‌ కేసులో తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) స్పీడ్‌ పెంచింది. ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయంలో మార్చి 2, 9 తేదీల్లో జరిపిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న ల్యాప్‌ట్యాప్‌లు, కంప్యూటర్ల హార్డ్‌డిస్క్‌లను సోమవారం పరిశీలించింది. కంప్యూటర్లలో ఏముందన్న విషయాన్ని రాబట్టే పనిని సైబర్‌ నిపుణులకు అప్పగించారు. ప్రస్తుతం వారు అందులో ఉన్న, డిలీట్‌ చేసిన సమాచారాన్ని రిట్రీవ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

అశోక్‌ అరెస్టుకు వ్యూహం ఎలా? 
టీడీపీ సేవామిత్ర యాప్‌ సాయంతో 3.60 కోట్ల మంది ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న, ప్రస్తుతం పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ అశోక్‌ అరెస్టు విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై సిట్‌ సోమవారం చర్చించింది. ఈ విషయంపై సిట్‌ బాస్, ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర తన బృంద సభ్యులతో సోమవారం భేటీ అయ్యారు. ప్రస్తుతం అశోక్‌ ఏపీలో తలదాచుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ఆయన్ను అరెస్టు చేసే క్రమంలో తలెత్తే పరిణామాలపై పోలీసులు ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. డేటా చౌర్యం కేసులో ఏపీ ప్రభుత్వం కూడా రెండు వేర్వేరు సిట్‌ బృందాలను వేసిన నేపథ్యంలో అశోక్‌ ఏపీ సిట్‌ పోలీసుల ముందు ప్రత్యక్షమవుతాడా? అన్న విషయం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అశోక్‌ కాల్‌ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. గత అరు నెలల్లో అశోక్‌ ఎవరెవరితో మాట్లాడారు? అందులో ఉన్న ప్రముఖులు ఎవరు? ఫిబ్రవరి 23న పోలీసులు ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయంలో ప్రాథమిక విచారణకు వెళ్లిన రోజు అశోక్‌ ఏపీలోని పలువురు ప్రముఖులకు పెద్ద మనుషులతో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.

కోర్టు ఆదేశాలతో కొత్త ఉత్సాహం
తనను అన్యాయంగా డేటా చౌర్యం కేసులో ఇరికించారంటూ తెలంగాణ హైకోర్టులో ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌ వేసిన పిటిషన్‌పై కోర్టు స్పందించింది. తెలంగాణ పోలీసులకు సమాధానం చెప్పాలని స్పష్టం చేసిన నేపథ్యంలో సిట్‌ బృందానికి కొత్త ఉత్సాహం వచ్చింది. అశోక్‌ తరఫున వాదించేందుకు దేశంలో పేరుమోసిన లాయర్లు రావడం, ఏపీ ప్రభుత్వం అతన్ని వెనకేసుకురావడం, త్వరలోనే బయటికి వస్తాడంటూ సాక్షాత్తూ ఏపీ సీఎం ప్రకటించడంతో అసలు అశోక్‌ చిరునామా దొరుకుతుందా? అనే సందిగ్ధంలో పడిన పోలీసులు కోర్టు ఆదేశాలతో మరింత వేగంగా పనిచేయనున్నారు. అతని కదలికలపై ఇప్పటికే సమాచారం ఉన్నప్పటికీ తెలంగాణ సిట్‌ సభ్యులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అతన్ని చట్టపరంగానే కోర్టు ముందు నిలబెట్టాలన్న లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మరోవైపు కోర్టు ఆదేశాల నేపథ్యంలో అశోక్‌ ఇప్పుడు ఏమని సమాధానం ఇస్తాడనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement