లోకేశ్‌తో అశోక్(ఫైల్)
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రజల వ్యక్తిగత డేటా, ఆధార్ వివరాల చౌర్యం కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ముగియడం, ఈ కేసులో అదనంగా ఆధార్ కేసు కూడా తోడవడంతో నేరం తీవ్రత మరింత పెరిగింది. అశోక్‌ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రణాళిక కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పలు రకాల వ్యూహాలను సిద్ధం చేసుకున్న సిట్... న్యాయస్థానం ఆదేశాలతోనే ముందుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ యాప్ ‘సేవామిత్ర’ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పౌరుల డేటా చోరీ చేసేలా ఏపీ ప్రభుత్వం వీలు కల్పించడం తెలిసిందే.
అరెస్టుకు సరిపడా ఆధారాలు..
ఈ కేసులో సిట్ అధికారులు పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్‌సంస్థ అధినేత దాకవరం అశోక్ అరెస్టుకు సరిపడా సాక్ష్యాలు, ఆధారాలు సేకరించారు. పలుమార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినా.. అశోక్ అజ్ఞాతం వీడటం లేదు. పైగా ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం పాత్ర స్పష్టంగా కనిపిస్తుండటం, సాక్షాత్తూ ప్రభుత్వ పెద్దలే నిందితుడిని వెనకేసుకు రావడంతో ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. అప్పట్లో అశోక్‌ను అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు ప్రయత్నించారు. విజయవాడ, నెల్లూరులో అశోక్ ఉన్నట్లు సమాచారం కూడా అందింది. నిందితులెవరైనా వదిలిపెట్టబోమని, న్యాయస్థానం ముందు ప్రవేశపెడతామని సిట్ చీఫ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర వ్యాఖ్యానించడంతో అశోక్ అరెçస్టు తప్పదన్న వాదనలు బలపడ్డాయి. అదే సమయంలో లోక్‌సభ ఎన్నికల కోడ్ రావడంతో ఇంతకాలం ఈ కేసు కాస్త నెమ్మదించింది. ఇప్పుడు ఆధార్ ఫిర్యాదుతో మళ్లీ సిట్ దర్యాప్తు వేగం పుంజుకుంది.
రాజకీయ కారణాలతోనే ఆగుతున్నారా?
ఈ కేసులో నిందితుడికి ఏపీ ప్రభుత్వ పెద్దలు ఆశ్రయమిస్తున్నారంటూ ప్రచారం జరగడం సమస్యగా మారింది. అశోక్ ఆచూకీ తెలిసినా అతన్ని అరెస్టు చేయడానికి తెలంగాణ సిట్ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇంకొన్ని రోజులు వేచి చూసి న్యాయస్థానం ద్వారానే అశోక్‌ను పట్టుకోవాలన్నది సిట్ యోచనగా తెలుస్తోంది. వారి జాప్యానికి రాజకీయ పరిణామాలు కూడా కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఓటుకు కోట్లు కేసులోనూ నిందితులను వెనకేసుకొచ్చిన సీఎం చంద్రబాబు, అతని కుమారుడు లోకేశ్‌లు ఈ కేసులోనూ అదే తరహాలో వ్యవహరిస్తుండటం గమనార్హం.
లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు..!
మొదటి నుంచి ఏపీ మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ అశోక్... ఆ సాన్నిహిత్యంతోనే పార్టీ కార్యక్రమాల నిర్వహణ దక్కించుకున్నాడని సమాచారం. సేవామిత్ర యాప్‌లో సర్వే కోసం ఉపయోగించిన ప్రతి అంశం ఎలాగైనా తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేలా ఉందన్న ఆరోపణలు ముమ్మరమయ్యాయి. చంద్రబాబు, లోకేశ్‌లతో ఉన్న పరిచయాల కారణంగానే ప్రభుత్వం... సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా, ఆధార్ సమాచారం, ఓటరు లిస్టు తదితరాలు అశోక్‌కు యాక్సెస్ చేసుకునే వీలు కల్పించిందన్న విషయాన్ని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
ఐటీ గ్రిడ్స్‌కే పరిమితమా..?
ఈ కేసులో అత్యంత గోప్యంగా ఉండాల్సిన పౌరుల వ్యక్తిగత సమాచారం వివరాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడం ఆధార్ సెక్షన్ల ప్రకారం నేరం. ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. తెలంగాణ రాష్ట్ర పౌరుల ఆధార్ డేటా కూడా ఐటీ గ్రిడ్స్ వద్ద ఉండటంతో ఇది జాతీయస్థాయిలో చర్చకు దారితీసింది. గోప్యతను భద్రంగా ఉంచాల్సిన ప్రభుత్వాలే ఇలా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే వ్యక్తిగత సమాచారానికి రక్షణ ఎక్కడని పలువురు వాపోతున్నారు. ఒకవేళ ఈ డేటా శత్రు దేశాల చేతిలో పడితే అది దేశ భద్రతకే ముప్పు అని యూఐడీఐఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఐటీ గ్రిడ్స్ దాదాపు రెండు రాష్ట్రాలకు చెందిన 7 కోట్ల మందికిపైగా సమాచారం సేకరించి ఆమెజాన్ క్లౌడ్ స్టోరేజీలో దాచింది. ఐటీ గ్రిడ్స్ డేటా చౌర్యానికి పాల్పడిన విషయం వాస్తవమేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్) కూడా ధ్రువీకరించింది. ఇప్పుడు ఈ డేటా ఐటీ గ్రిడ్స్ కంపెనీ నుంచి ఇంకెక్కడికైనా లీక్ అయిందా? ఎవరితోనైనా షేర్ చేసుకున్నారా? అన్న విషయాలపైనా సిట్ అధికారులు దృష్టి సారించారు. దేశ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని విదేశాలకు చెందిన క్లౌడ్ కంపెనీలో స్టోర్ చేయడం చట్ట విరుద్ధం. ఇది జాతీయ భద్రతకు పెనుముప్పుగా పరిణమించే ప్రమాదం ఉండటంతో అధికారులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment