సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కేసులో ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అశోక్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టేయాలన్న ఆయన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించి వివరణ ఇవ్వాలని అశోక్‌కు స్పష్టం చేసింది. ఆయన దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. అప్పటివరకు అశోక్‌ను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇచ్చేందుకూ హైకోర్టు నిరాకరించింది. తనపై డేటా అనలిస్ట్ తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జి. దశరథరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఆర్ నగర్ పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారని, వాటిని కొట్టేయాలని కోరుతూ అశోక్ గత వారం హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ సోమవారం విచారణ జరిపారు.
ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి. ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ మొత్తం వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తోందన్నారు. అశోక్‌కు నోటీసులు జారీ చేసినా ఇప్పటివరకు స్పందించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నోటీసులకు స్పందించకుండా ఇలా పిటిషన్లు దాఖలు చేయడం సరికాదన్నారు. పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ సమయంలో అశోక్ తరఫున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ సిట్ దర్యాప్తే తమకు అభ్యంతరకరమన్నారు. వారికి లేని పరిధిని ఉపయోగించి ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతాయా లేదా? అన్నది మాత్రమే చూడాలని కోరారు. ఇది తేలితే ఈ కేసు తేలిపోతుందన్నారు.
ఈ సమయంలో ఫిర్యాదుదారు దశరథరామిరెడ్డి తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఈ కేసులో సీనియర్ న్యాయవాది హాజరవుతున్నారని, అందువల్ల విచారణను కొద్దిసేపు వాయిదా వేయాలని కోరారు. ఈ సమయంలో లూథ్రా ఏదో చెప్పబోతుండగా న్యాయమూర్తి ఆయనను వారిస్తూ తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ముందు పిటిషనర్‌ను పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించాలని సూచించాలంటూ లూథ్రాకు స్పష్టం చేశారు. అప్పటివరకు పిటిషనర్‌ను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని లూథ్రా కోరగా న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. పిటిషనర్ ఎందుకు ఆందోళన చెందుతున్నారని, ముందు నోటీసులకు స్పందించమనండి అని పునరుద్ఘాటించారు. మిగిలిన విషయాలపై తదుపరి విచారణ సమయంలో వాదనలు వింటానని స్పష్టం చేశారు.
అశోక్‌కు మరోసారి నోటీసులు
డేటా చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌డైరెక్టర్ దాకవరపు అశోక్‌కు తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13న గోషామహల్‌లోని తమ కార్యాలయానికి ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు కేపీహెచ్‌బీలోని అశోక్ ఇంటికి సోమవారం వెళ్లిన తెలంగాణ పోలీసులు... అశోక్ పరారీలో ఉండటంతో అతని ఇంటికి నోటీసులు అంటించారు. ఏపీ, తెలంగాణ ప్రజల డేటాను సేవామిత్ర యాప్ సాయంతో తస్కరించారంటూ విజిల్ బ్లోయర్ లోకేశ్వర్‌రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, దీనిపై ఐపీసీ సెక్షన్లు 120–బీ, 379, 420, 188తోపాటు ఐటీ చట్టంలోని సెక్షన్లు 66 బీ, 72 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిట్ నోటీసులో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే ఈ నెల 2, 3 తేదీల్లో నోటీసులు పంపినా విచారణకు హాజరు కానందున మరోసారి నోటీసులు పంపుతున్నామని తెలిపింది. ప్రస్తుతం అశోక్ ఏపీ ప్రభుత్వ పెద్దల సాయంతో విజయవాడ, గుంటూరు పరిసరాల్లో తలదాచుకుంటున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment