యూఐడీఏఐ, టీడీపీ యాప్ (సేవామిత్ర), ఐటీ గ్రిడ్స్, డేటా చోరీ, ఏపీ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఏపీతో పాటు తెలంగాణకు చెందిన దాదాపు 7 కోట్ల మంది పౌరుల ఆధార్ వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ యాప్ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ చేతిలో పెట్టిందెవరు? దీని చుట్టూనే ఇప్పుడు సిట్ దర్యాప్తు సాగుతోంది. సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోసిటరీ (సీఐడీఆర్), స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎస్‌ఆర్‌డీహెచ్) వద్ద భద్రంగా ఉం డాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం ఎలా లీకయిందన్నది వారికి సవాలు విసురుతోంది. ఈ లీకేజీ వెనక ఏపీ సర్కారు పెద్దల హస్తం ఉండొ చ్చని యూఐడీఏఐ అనుమానిస్తోంది. ఇలాంటి అత్యంత గోప్యమైన సమాచారాన్ని ఆయా సంస్థల్లో పనిచేసే విచక్షణ ఉన్న ఏ అధికారీ ఇవ్వడని, ప్రలోభాలకు లేదా పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గితేనే ఆస్కారం ఉంటుందని భావిస్తోంది.
తొలుత వేటు పడేది అధికారులపైనే..
ఈ కేసులో ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని సిట్ బృందం ఇప్పటికే హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న 40కిపైగా హార్డ్ డిస్కులను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్) సాయంతో విశ్లేషించిన సంగతి తెలిసిందే. డేటా చౌర్యం జరిగిందని ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఇవ్వడంతో సిట్ దర్యాప్తు స్పీడు పెంచింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలతో ముందుకెళ్లడం ద్వారా సేవామిత్ర యాప్‌లో ఉన్న వివిధ శాఖల సమాచారం ఎలా వచ్చిందన్న విషయంపై సిట్ దర్యాప్తు చేయనుంది. ఈ స్కాంలో అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే తొలి ముద్దాయిలు వారే అవుతారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment