‘చోరీ డేటా’ అంతా ఎన్‌క్రిప్షన్‌లోనే..! | IT Grids Set up without scratching evidence | Sakshi
Sakshi News home page

‘చోరీ డేటా’ అంతా ఎన్‌క్రిప్షన్‌లోనే..!

Published Tue, Mar 12 2019 2:53 AM | Last Updated on Tue, Mar 12 2019 4:53 AM

IT Grids Set up without scratching evidence - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘సేవామిత్ర’యాప్‌... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వెలుగుచూసిన డేటా స్కాం మొత్తం తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ యాప్, దాన్ని తయారు చేసిన ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ చుట్టూనే తిరుగుతోంది. ఈ యాప్‌ తయారీలో ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ దాకవరపు అశోక్‌ అనేక జాగ్రత్తలు తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. అందులో ప్రధానమైంది ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ విధానం. తాము చేస్తున్న భారీ స్కాం భవిష్యత్తులో వెలుగులోకి వచ్చినా దర్యాప్తు సంస్థలకు ఆధారాలు లభించకుండా ఉండేందుకే అశోక్‌ ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. యాప్స్‌ ద్వారా జరిగే సమాచార మార్పిడికి సంబంధించి ఉపయోగించే పరిజ్ఞానమే ఎన్‌క్రిప్షన్, డిక్రిప్షన్‌ విధానం. వాట్సాప్‌ ద్వారా ఓ కాంటాక్ట్‌కు తొలిసారి ఎవరైనా సందేశం పంపినప్పుడు ‘ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌’అంటూ ప్రత్యేక సూచన వస్తుంది. అంటే ఓ సెండర్‌ పంపిన మెసేజ్‌ రిసీవర్‌కు వెళ్లే వరకు అది ఎన్‌క్రిప్షిన్‌ విధానంలో ఉంటుంది. మెసేజ్‌లో పదాలను టైప్‌ చేస్తే అది ఎన్‌క్రిప్ట్‌ అయ్యే సరికి ‘కీ’లుగా మారిపోతుంది. ఉదాహరణకు ‘టీడీపీ’అనే పదాన్ని ‘ఎండీ5 ఆన్‌లైన్‌’అనే ఎన్‌క్రిప్టర్‌ వెబ్‌సైట్‌లో టైప్‌ చేస్తే (5ec7c4ede4cb6 c64289a5ed105285945) అనే ‘కీ’గా మారిపోయింది. దీంతో ఇది ఎన్‌క్రిప్ట్‌ అయినట్లు లెక్క. ఈ సందేశం రీసీవ్‌ చేసుకునే వ్యక్తి ఫోన్‌లోకి వచ్చిన తర్వాత డిక్రిప్షన్‌ ప్రక్రియ పూర్తై మళ్లీ ‘టీడీపీ’అనే పదంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓటర్ల డేటాను దుర్వినియోగం చేయడానికి ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ఇదే విధానాన్నే వినియోగించింది. 

ట్యాబ్‌లలో వాడిన సాఫ్ట్‌వేర్‌ అదే... 
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సేవామిత్ర సర్వేయర్లకు ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ద్వారా జారీ చేసిన ట్యాబ్స్‌ను ఆ సంస్థకు సంబంధించిన సర్వర్‌తో అనుసంధానించారు. ఈ ట్యాబ్స్‌లో ఉండే ‘సేవామిత్ర’యాప్‌లో ఎన్‌క్రిప్షన్‌తోపాటు డిక్రిప్షన్‌ సాఫ్ట్‌వేర్‌ సైతం అంతర్భాగంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సర్వర్‌ నుంచి ట్యాబ్‌ వరకు డేటా మార్పిడి మొత్తం ఎన్‌క్రిప్షన్‌ విధానంలోనే జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఎన్‌క్రిప్షన్‌లో ఉన్న డేటాను డిక్రిప్షన్‌లోకి మార్చి పదాలుగా చూపించడంలో ఆ యాప్‌లో ఉన్న ‘కీ’ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ ‘కీ’లలోనూ రెండు రకాలు ఉంటాయి. పబ్లిక్‌ ‘కీ’తో కూడిన ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాన్ని సర్వర్‌ నుంచి తీసినా సాధారణ పదాలుగా మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ఈ డేటాను ప్రైవేట్‌ ‘కీ’తో ఎన్‌క్రిప్ట్‌ చేసింది. దీంతో ఎవరైనా సర్వర్‌ను స్వాధీనం చేసుకున్నా... అమెజాన్‌ వంటి సంస్థల నుంచి డేటా పొందినా డిక్రిప్ట్‌ చేయడం సాధ్యం కాదు. ఈ ‘క్రిప్షన్స్‌’డేటాను రాసే ‘అల్గోరిథమ్‌’ను బట్టి మారిపోతుంది. ఓ సంస్థ రూపొందించిన ‘అల్గోరిథమ్‌’మరొకరి దానితో ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోలదు.

తమ వ్యవహారం గుట్టురట్టైనా ఆధారాలు చిక్కకూడదనే ఐటీ గ్రిడ్స్‌ ఈ జాగ్రత్త తీసుకున్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. తమ డేటాను ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌తో ఉండేలా చేస్తే భవిష్యత్తులో ఈ భారీ స్కాం వెలుగులోకి వచ్చినా దర్యాప్తు సంస్థలు ఐటీ గ్రిడ్స్‌తోపాటు అమెజాన్‌ నుంచి సమాచారం తీసుకున్నా అది ఆధారంగా పనికి రాకూడదనే ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ రూపంలో ఉన్న డేటాతో కేవలం ‘కీ’తెలుసుకోవడం తప్ప అందులోని పదాలను గుర్తించలేదు. డేటాకు సంబంధించిన ప్రైవేట్‌ ‘కీ’అందుబాటులో ఉంటే తప్ప ఆ ‘కీ’లను పదాలుగా మార్చి అందులోని అంశాలను తెలుసుకోలేరు. ఈ విషయం గుర్తించిన తెలంగాణ సిట్‌ అధికారులు... సైబర్‌ నిపుణుల సాయంతో దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. ప్రాథమికంగా డేటా మొత్తం క్రోడీకరిస్తే ఆపై డిక్రిప్ట్‌ చేయవచ్చని యోచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement