
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో మహాకూటమిని ఏర్పాటు చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కనబడుతోందని, ఎన్ని కూటములు కట్టినా విజయం టీఆర్‌ఎస్‌దేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలుస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని, ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటూ రాదని ఎద్దేవా చేశారు. సోమవారం టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఎన్.భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
టీఆర్‌ఎస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిపై ఉత్తమ్‌తో బహిరంగ చర్చకు సిద్ధమని, ఒక్క పరకాల నియోజకవర్గానికే గడిచిన మూడేళ్లలో రూ.1,000 కోట్ల నిధులు వచ్చాయన్నారు. గీసుకొండ మండలంలో స్థానిక నేతలు చెప్పిందే ఉత్తమ్ మాట్లాడారని, వేల మంది కాంగ్రెస్‌లో చేరతారని ప్రకటించుకున్నా నలుగురు కూడా చేరలేదని అన్నారు. చివరకు పార్టీలో చేరింది కూడా పాత కాంగ్రెస్ వాళ్లేనని చెప్పారు.
పెద్ద మాటలు మాట్లాడుతున్న ఉత్తమ్‌కు దమ్ముంటే పరకాలలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. రేవంత్‌రెడ్డి పరకాలకు వచ్చి పోటీ చేసినా సరేనని, వారిద్దరిలో ఎవరు గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. రేవంత్ వంటి బ్లాక్ మెయిలర్, బ్రోకర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్న ఉత్తమ్ తనను పార్టీ మారిన బ్రోకర్ అనడం హాస్యాస్పదమని అన్నారు.