ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్
భోపాల్ : వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని, అందుకోసం ప్రాంతీయ పార్టీలతో దోస్తీ కట్టేందుకు సిద్ధంగా ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రచార ఇన్‌చార్జి జ్యోతిరాదిత్య సింధియా, సీనియర్ నేత కమల్ నాథ్‌ల మధ్య విభేదాలు తలెత్తాయన్న వార‍్తల్ని ఆయన కొట్టిపడేశారు. వారిద్దరు కలిసి కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్‌లో పదిహేనేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉందన్న దిగ్విజయ్ సింగ్.. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత ప్రయోజనాల కన్నా పార్టీని ఏవిధంగా అధికారంలోకి తీసుకురావడంపైనే తాము దృష్టిసారించామన్నారు. బీజేపీ పాలనలో ప్రజలు విసుగుచెందారని, వచ్చే ఎన్నికల్లో మరో పార్టీకి అవకాశం ఇవ్వాలనే భావన వారిలో స్పష్టంగా కనబడుతోందని వ్యాఖ్యానించారు.
సీఎం అభ్యర్థిని కాను..
సీఎం అభ్యర్థిగా తాను పోటీపడుతున్నానంటూ వస్తోన్న వార్తల్ని దిగ్విజయ్ ఖండించారు. మధ్యప్రదేశ్‌కు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన తనకు మరోసారి ఆ పదవి చేపట్టాలనే ఆశ లేదన్నారు. కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి అధిష్టానం సానుకూలంగా ఉందని తెలిపారు. బీఎస్పీతో పొత్తు విషయమై కమల్ నాథ్ జరుపుతున్న చర్చలు సఫలమైతే పార్టీకి అదనపు బలం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయంగా లబ్ది పొందేందుకే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆరెస్సెస్ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించిందని దిగ్విజయ్ విమర్శించారు. లౌకిక వాది అయిన ప్రణబ్ దాదాను ఆహ్వానించడం ద్వారా ఆరెస్సెస్ తమ మీద ఉన్న మతతత్వ ముద్రను తొలగించుకునే ప్రయత్నం చేసింది గానీ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. 1952 సార‍్వత్రిక ఎన్నికల నుంచే కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ఆరెస్సెస్ ప్రయత్నిస్తోంది గానీ ఆ ప్రయత్నాలేవీ సఫలం కావన్నారు.
Comments
Please login to add a commentAdd a comment