
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వ సంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవపరిస్తే.. వారికే జనమే బుద్ధి చెబుతారని దిగ్గీ రాజా పేర్కొన్నారు. నిజమైన వ్యక్తులే పార్టీలో ఉంటారని.. మిగతా వారు కాంగ్రెస్‌ను వీడి వెళ్లొచ్చని వ్యాఖ్యానించారు. పరోక్షంగా తాజా సంక్షోభానికి కారణమని భావిస్తున్న ఆ పార్టీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.17 మందిఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహిస్తోన్న సింధియాను కలిసేందుకు తాము ప్రయత్నించామని.. కానీ, అతను అందుబాటులోకి రాలేదని తెలిపారు. సింధియాకు స్వైన్ ప్లూ ఉన్నట్టుంది.. అందుకే తమతో మాట్లాడటం వీలుకావడం లేదు అని తనదైనశైలిలో సెటైర్ వేశారు.
(చదవండి : కమల్ సర్కార్‌లో సింధియా చిచ్చు)
‘ఎవరైతే మధ్యప్రదేశ్ ఓటర్ల తీర్పును ధిక్కరిస్తారో.. వారికి ప్రజలు కచ్చితంగా బుద్ది చెబుతారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పటికీ పార్టీలోనే ఉంటారు. మధ్యప్రదేశ్‌లో పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది. సింథియాను కలిసేందుకు ప్రయత్నించాం. కానీ ఆయనకు స్వైన్ ప్లూ సోకినట్లు చెప్పారు. అందుకే ఆయన మాతో మాట్లాడలేకపోతున్నారు’ అని దిగ్విజయ్ అన్నారు.
కాగా, మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సోమవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్యా సింధియా, ఆరుగురు మంత్రులు సహా మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు అదృశ్యమయ్యారు. వీరంతా ప్రత్యేక విమానాల్లో సోమవారం బెంగళూరుకు వచ్చి, రోడ్డు మార్గంలో బెంగళూరు రాజానుకుంటె సమీపంలో ఉన్న ఓ రిసార్టుకు వెళ్లారు. వీరిని సంప్రందించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ వారు టచ్‌లోకి రావడంలేదు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న కమల్‌నాథ్ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని సోమవారం రాత్రి భోపాల్ చేరుకున్నారు. వెంటనే దిగ్విజయ్‌సింగ్ తదితర సీనియర్ నేతలతో తన నివాసంలో రెండు గంటలపాటు అత్యవసర సమాలోచనలు జరిపారు. రాత్రి 10 గంటలకు కేబినెట్ భేటీ ఏర్పాటుచేసి, వివిధ పరిణామాలపై చర్చించారు. అనంతరం, హాజరైన 22 మంది మంత్రులు రాజీనామా చేశారు.
దీంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది. ఫలితంగా అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవులు దక్కే అవకాశం ఉంది. బెంగళూరు రిసార్టులో ఉన్న సింధియా వర్గం ఎమ్మెల్యేలంతా తిరిగి వస్తారని కమల్‌నాథ్ శిబిరం చెబుతోంది. సింధియాను శాంతింపజేసేందుకు పీసీసీ అధ్యక్ష పదవి లేదా రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. మరోవైపు, సింధియా బీజేపీలో చేరతారని.. ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలున్నాయని ఊహాగానాలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment