మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు. చిత్రంలో బొత్స
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై వరుసగా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తూనే ఉంది. మంగళవారం పదో నోటీసు ఇచ్చింది. సభలో ఆర్డర్‌లో లేనందున ఈ నోటీసును సభ ముందుకు తీసుకురాలేకపోతున్నానని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రశ్నోత్తరాలతో లోక్‌సభ ప్రారంభమైంది. కావేరీ నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో అన్నాడీఎంకే సభ్యులు వెల్‌లో ఆందోళన కొనసాగించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ సభను వాయిదా వేశారు. సభ తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. కేంద్రంపై అవిశ్వాస తీర్మానాల కోసం వచ్చిన నోటీసుల గురించి సభాపతి ప్రస్తావించారు.
వైఎస్సార్‌సీపీ నుంచి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, టీడీపీ నుంచి తోట నర్సింహం, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేశినేని శ్రీనివాస్, గల్లా జయదేవ్, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నుంచి ఎన్.కె.ప్రేమ్‌చంద్రన్, సీపీఎం నుంచి పి.కరుణాకరన్, మహ్మద్ సలీం, కాంగ్రెస్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, సీపీఐ నుంచి సి.ఎన్.జయదేవన్, వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన బుట్టా రేణుక.. ఇలా 14 మంది సభ్యులు కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు తనకు చేరినట్లు సభాపతి మధ్యాహ్నం 12.11 గంటలకు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సభలో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు అవసరమైన సభ్యుల బలాన్ని తెలియజేసేందుకు వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ, జేఎంఎం, ఎంఐఎం తదితర పార్టీల సభ్యులంతా లేచి నిలుచున్నారు. అయితే, అన్నాడీఎంకే సభ్యులు వెల్ నుంచి కదల్లేదు. దీంతో సభ సజావుగా లేదంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. అవిశ్వాస తీర్మానం నోటీసులను సభ ముందుకు తేలేకపోతున్నానని ప్రకటించి, సభను బుధవారానికి వాయిదా వేశారు.
మరో మూడు రోజులే...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ ప్రకారం మరో మూడు రోజులే మిగిలి ఉన్నాయి. కాగా, వైఎస్సార్‌సీపీ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి మంగళవారం ఉదయం 10.30 గంటలకు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment