
సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి : అపర సంజీవని వంటి ప్రత్యేకహోదా కోసం ఎంపీలు రాజీనామా చేస్తారని, ఆ వెంటనే ఆంధ్రుల ఆస్తి అయిన ఏపీ భవన్‌లో ఆమరణదీక్ష చేస్తారని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం హస్తినలో పెను సంచలనంగా మారింది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందా అని అన్ని రాజకీయ పార్టీలలోనూ దీనిపై చర్చ జరుగుతోంది. నాలుగురోజుల విరామం తర్వాత మరలా నేడు పార్లమెంటు సమావేశమౌతుండటంతో ఏం జరగనుందనే దానిపై అందరూ ఆసక్తితో ఉన్నారు. ఆరాతీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదోసారి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని సోమవారమైనా చర్చకు స్వీకరిస్తారా లేక యథాప్రకారం సభను వాయిదా వేస్తారా అన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. అందుకే అందరి దృష్టి లోక్‌సభపైనే కేంద్రీకృతమయ్యింది. పట్టు వదలకుండా వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పటికి తొమ్మిదిసార్లు అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చింది.
9వ నోటీసు ప్రస్తుతం లోక్‌సభ స్పీకర్ వద్ద ఉంది. అది సోమవారం ఎజెండాలో చోటు చేసుకోవాలని, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలని ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఆశిస్తున్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపి తమ పోరాటానికి అండగా నిలబడాల్సిందిగా ఇప్పటికే ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని పార్టీలకూ లేఖలు రాయడం, ఆ పార్టీ ఎంపీలు ప్రత్యేకంగా ఆయా పార్టీల నాయకులను కలసి విజ్ఞప్తి చేయడంతో అవిశ్వాసానికి మద్దతు తెలుపుతున్న పార్టీల సంఖ్య పెరుగుతోంది. నాలుగేళ్లుగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతూ హోదా డిమాండ్‌ను కేంద్రానికి బలంగా వినిపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అవిశ్వాస తీర్మానానికి విపక్ష పార్టీల మద్దతు కూడగట్టడంలో కూడా సఫలీకృతమైంది. ఆ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్న ప్రతిసారీ వందమందికి పైగా ఎంపీలు మద్దతుగా లోక్‌సభలో లేచి నిలబడుతున్నారు. మరోవైపు సభలో వెల్‌లో ఉండి నిరసన తెలుపుతున్న అన్నాడీఎంకే ఎంపీలతో కూడా వైఎస్సార్ సీపీ ఎంపీలు నిరంతరం సంప్రదింపులు జరుపుతూ అవిశ్వాసంపై చర్చ జరిగేవరకు నిరసన విరమించాలని కోరుతున్నారు.
ఎంపీల రాజీనామా, ఆమరణదీక్ష.. చరిత్రలో ఇదే ప్రథమం..
భారతీయ జనతా పార్టీ ఈ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు స్వీకరించేందుకు సిద్ధంగా ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నా ప్రతిరోజూ సభ వాయిదా పడుతూనే ఉంది. షెడ్యూలు ప్రకారం నేటి నుంచి మరో ఐదురోజులు మాత్రమే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల గడువు ఉంది. అవిశ్వాసాన్ని చర్చకు అనుమతించకుండా చివరి రోజు గానీ, అంతకు ముందుగానీ సభను నిరవధికంగా వాయిదా వేస్తే అదే రోజు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సిద్ధంగా ఉన్నారు. తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయడంతో పాటు ఆ వెంటనే ఆంధ్రుల ఆస్తి అయిన ఏపీ భవన్‌కు వెళ్లి ఆమరణ నిరాహార దీక్ష చేపడతారని పేరేచర్ల బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అటు రాజకీయ పార్టీలలోనూ, ఇటు ప్రజలలోనూ ఇది చర్చనీయాంశంగా మారింది. ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణదీక్షకు కూర్చోవడం మునుపెన్నడూ ఎరగమని, ఇలాంటి ఘటన చరిత్రలో ఇదే ప్రథమమని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఢిల్లీ రాజకీయవర్గాలలో ఎవరిని కదిపినా దీనిగురించే మాట్లాడుతున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులకు ఫోన్లు చేసి దీని గురించే ఆరాతీస్తుండటం కనిపిస్తోంది. ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడమంటే మామూలు విషయం కాదని, ఈ పరిణామం ఎటువైపు దారితీస్తుందో ఊహకు అందడం లేదని విశ్లేషకులంటున్నారు. మరోవైపు ఎంపీల ఆమరణ నిరాహార దీక్షలకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు, ప్రజా సంఘాలు కూడా ఆందోళనలలో పాల్గొనాలని వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపుతో ఆయా వర్గాలు ఆందోళనలకు సమాయత్తమవుతున్నాయి.
ఏపీ ఎంపీలంతా రాజీనామా చేస్తే కేంద్రం దిగిరాదా..
మేం ఐదుగురమే కాదు.. ఈ పోరాటంలో మీరు కూడా కలసి రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తెలుగుదేశం పార్టీ ఎంపీలకు పిలుపునిస్తున్నారు. మొత్తం 25 మంది ఎంపీలం రాజీనామా చేసి ఏకతాటిపై నిలబడితే కేంద్రం దిగిరాక ఏం చేస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం 25 మంది ఎంపీలం రాజీనామా చేసి ఆమరణ దీక్షకు కూర్చుంటే దేశమంతా కదలిక వస్తుందని వారు పేర్కొంటున్నారు. మొత్తమ్మీద సోమవారం పార్లమెంటు ప్రారంభం కాగానే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలే హాట్ హాట్‌గా మారబోతున్నాయి. ఎంపీలు రాజీనామాలు చేయడంతోపాటు ఏపీ భవన్‌లో ఆమరణ దీక్ష చేస్తారని వైఎస్ జగన్ ప్రకటించడంతో ఏం చేయాలో దిక్కుతోచక టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. ఈ విషయంలో కూడా వైఎస్సార్ సీపీ బాటలోనే నడిచి ఢిల్లీలో దీక్షకు దిగితే మేలని, అయితే ఆ క్రెడిట్ దక్కించుకోవడం కోసం ఏం చేయాలనేదానిపై టీడీపీ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అందరం రాజీనామాలు చేద్దాం రండి.. ఆమరణదీక్షకు కూర్చుందాం రండి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇచ్చిన పిలుపుపై మాత్రం టీడీపీ నోరుమెదపడం లేదు. అవిశ్వాసంపై ఆడినట్లే ఇపుడు కూడా ఏదైనా నాటకం మొదలుపెడతారా లేక రాజీనామాలకు, ఆమరణదీక్షకు సిద్ధపడతారా అనేదాన్నిబట్టి వారి చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోతుందని విశ్లేషకులంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment