
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయ పార్టీలకు రూ 2000 మించి నగదు విరాళాలు ఇవ్వరాదని ఆదాయ పన్ను శాఖ ప్రజలను హెచ్చరించింది. అక్రమ నగదు లావాదేవీలకు దూరంగా ఉండాలని అప్రమత్తం చేసింది. ఎన్నికల ఫండింగ్‌ను ప్రక్షాళన చేసేందుకు రాజకీయ పార్టీలకు విరాళాల కోసం ఎస్‌బీఐ నిర్ధిష్ట బ్రాంచ్‌ల నుంచి ఎలక్టోరల్ బాండ్‌లను ప్రభుత్వం నోటిఫై చేసిన విషయం తెలిసిందే. తాజా నిబంధనల మేరకు రాజకీయ పార్టీలకు ఏ ఒక్కరూ రూ 2000కు మించి నగదు విరాళం ఇచ్చేందుకు అనుమతించరు.
నమోదిత ట్రస్ట్, రాజకీయ పార్టీకి ఏ వ్యక్తీ రూ 2000కు పైగా నగదు విరాళం ఇవ్వరాదని ఐటీ శాఖ ప్రముఖ వార్తాపత్రికల్లో ప్రకటనలు జారీ చేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలకు సంబంధించి ప్రభుత్వం వార్తాపత్రికల్లో ఇలా ప్రకటన ఇవ్వడం ఇదే తొలిసారి. ఎలక్టోరల్ బాండ్ల జారీకి సంబంధించి సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన క్రమంలో ఈ ప్రకటన వెలువడిందని భావిస్తున్నారు.
ఒక రోజులో ఒక వ్యక్తి నుంచి ఎలాంటి లావాదేవీకైనా రూ 2 లక్షలు అంతకుమించి నగదును స్వీకరించరాదని ఇదే ప్రకటనలో ప్రజలకు ఐటీ శాఖ సూచించింది. వ్యాపార, వృత్తి పరమైన ఖర్చుల కింద రూ 10,000కు మించి నగదు రూపంలో చెల్లించరాదని పేర్కొంది. ఈ నిబంధనలను అతిక్రమిస్తే పన్ను లేదా పెనాల్టీ చెల్లించాల్సివస్తుందని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment