
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె. లక్ష్మణ్
హైదరాబాద్ : తెలంగాణలో ఎవరితోనూ పొత్తు ఉండదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షడు కె. లక్ష్మణ్ తెలిపారు. లక్ష్మణ్ మాట్లాడుతూ..నియోజకవర్గాల పునర్ విభజన ఉండదని జాతీయ నాయకత్వం నుంచి సమాచారం ఉందని స్పష్టంగా చెప్పారు. టీఆర్ఎస్ పార్టీనే మన టార్గెట్ అని అమిత్ షా అన్నారని వివరించారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిని అమిత్ షాకు వివరించానని తెలిపారు. రాష్ట్ర పర్యటనల్లో కేంద్ర మంత్రులు చేస్తున్న ప్రకటనలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానని, వాటిని పట్టించుకోవద్దని అమిత్ షా సూచించారని అన్నారు.
అలాగే ముందస్తు ఎన్నికలు ఉండవని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌లోని రాజకీయ నిరుద్యోగులకే ఉద్యోగాలు వస్తున్నాయి కానీ..ఉద్యమంలో పోరాడిన విద్యార్థులు, యువకులకు రావడం లేదని అన్నారు. రైతాంగ సమస్యలపై ఉద్యమాల్ని మరింత ఉదృతం చేస్తామని వివరించారు. రాష్ట్రంలో లక్షా 12వేల ఉద్యోగాలను భర్తీ చేసే వరకు పోరాడుతామని చెప్పారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడిపై ఒకటిన్నర రెట్లు మద్దతు ధర కల్పించేందుకు బడ్జెట్లో మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో మతోన్మాద మజ్లిస్‌ను టీఆర్‌ఎస్ ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిని ప్రజలు మరచిపోలేదని, ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే ఉందన్నారు.
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకే తానులో ముక్కలని అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఆయుష్మాన్ భవ పథకాలపై ఇంటింటికీ ప్రచారం చేస్తామన్నారు. సత్తుపల్లిలో టీఆర్‌ఎస్ నేత రామలింగేశ్వరరావు త్వరలో భాజపాలో చేరనున్నారని, బీజేపీలో చేరిన ఎన్నారై అమరేందర్ రెడ్డి, వనపర్తి నుంచి ఎమ్మెల్యే, లేదా మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేయనున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వనపర్తిలో కాషాయ జెండా రెపరెలాడుతుందన్నారు. కాగజ్ నగర్‌కు చెందిన డాక్టర్ శ్రీనివాస్‌ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.