మాట్లాడుతున్న నామా నాగేశ్వరరావు
పాల్వంచ: ఆంధ్రా వాసి రేణుకా చౌదరిని ఓడించాలని, తెలంగాణ వాడినైన తనను గెలిపించాలని టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం స్థానిక బీసీఎం రోడ్‌లోని మెక్ వెంకటేశ్వర్లు గ్రౌండ్ నందు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ పక్క రాష్ట్రం వారు మనపై పెత్తనం చేసేందుకు చూస్తున్నారని అన్నారు. పాల్వంచలోని కేటీపీఎస్‌లో తాను డైలీవేజ్ కార్మికుడిగా పనిచేశానని, అదృష్టవశాత్తు రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవచేసే భాగ్యం కలిగిందన్నారు. జిల్లా వాసిగా ఇక్కడి సమస్యలపై తనకు అవగాహన ఉందని, అందుబాలో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
గతంలో తెలంగాణ కోసం పార్లమెంట్‌లో తొలి ఓటు వేసిన ఎంపీగా చరిత్రలో మిగిలానని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. జలగం వెంగళరావు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, వెంగళరావు తనయుడు జలగం వెంకట్రావ్ ఎమ్మెల్యేగా గతం కంటే ఎక్కువ నిధులు సేకరించి అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు. మైనింగ్ యూనివర్సిటీ, ఎన్‌ఎండీసీ విస్తరణకు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ సాధనలో తాను భాగస్వామ్యం కావాలని, ఆయన బాటలో నడిచేందుకు వచ్చానని, తనను దీవించి గెలిపించాలని కోరారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రధాన మంత్రి మోదీ సైతం కాపీ కొట్టి అమలు చేస్తున్నారంటే ఇక్కడి సంక్షేమ పథకాలు ప్రజలు ఎంత దగ్గరయ్యాయో అర్థం అవుతుందని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక కోతలు లేని కరెంట్ అందిస్తున్నారని, రైతు బీమా, రైతు బంధు, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బరపటి వాసుదేవరావు, మాజీ చైర్మన్ గడిపెల్లి కవిత, పెద్దమ్మగుడి చైర్మన్ కోడి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్, భువన సుందర్‌రెడ్డి, సీతారామిరెడ్డి, అయితా గంగాధర్, కాల్వ భాస్కర్, చెన్నమల్లు, పొనిశెట్టి వెంకటేశ్వర్లు, రవిచంద్ర, మిరియాల కమలాకర్, విజయ్, దొప్పలపుడి సురేష్, జనార్దన్‌రెడ్డి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment