
సాక్షి, నిజామాబాద్ : సీనియర్ నేత, టీఆర్‌ఎస్ ఎంపీ డీ శ్రీనివాస్‌పై ఆయన తనయుడు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి.. జిల్లా అభివృద్ధి కోసం ఆలోచన చేయాలని డీఎస్‌ను అరవింద్ కోరుతున్నారు.
బీజేపీ నేత అయిన అరవింద్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... జిల్లా అభివృద్ధిపై దృష్టిసారించాలని డీ శ్రీనివాస్‌ను కోరారు. ‘నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ పాపం చంద్రబాబుదే. అయితే దాని విషయంలో ఇప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవిత పట్టించుకోవటం లేదు. మీరు(డీ శ్రీనివాస్) టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి. కాబట్టి, చొరవ తీసుకుని ఫ్యాక్టరీ తెరిపించేందుకు కృషి చెయ్యండి. సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది’ అని అరవింద్ పేర్కొన్నారు.
పనిలో పనిగా ఎంపీ కవితపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘చెరుకు ఫ్యాక్టరీలను తెరిపించకుండా కవిత అడ్డుకుంటున్నారు. రైతులు చెరుకు పంటకు దూరంగా ఉంటున్నారని.. ఉద్యోగాల విషయంలో యువత ఆసక్తి చూపటం లేదని ఆమె ఏవో సాకులు చెబుతున్నారు. పసుపు బోర్డు విషయంలో అయితే ముందడుగే వేయలేదు. చిన్న చిన్న హామీలు ఇవ్వటం కాదు. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రజలు మీ నుంచి పెద్దవే ఆశిస్తుంటారు. ముందు పెద్ద సమస్యలపై దృష్టిసారిస్తే మంచిది’ అని అరవింద్.. ఎంపీ కవితకు సూచించారు.